ఇండియా బ్లాక్‌తో దేశ దిశా నిర్దేశం మారుతుంది !

– ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తాం
– ఈసారి బిజెపికి నో ఛాన్స్‌
-ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆప్‌ నేత కేజ్రివాల్‌
న్యూఢిల్లీ : ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే దేశం దిశ, భవితవ్యం మారుతుందని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం తీహార్‌ జైలు నుండి విడుదలైన కేజ్రివాల్‌ శనివారం పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో రోడ్‌ షోలో పాల్గన్నారు. ”ఇదొక చారిత్రక క్షణం. చరిత్ర మలుపు తీసుకుంటోంది. ఇండియా బ్లాక్‌ అధికారం చేపట్టడంతో దేశ దిశా నిర్దేశనాలే మారిపోతాయి’ అని ఆయన అన్నారు. ‘నియంతృత్వానికి వ్యతిరేకంగానే మా పోరాటం. ఇందుకోసం మీ మద్దతు కావాలి. ఏ నియంతనూ, ఏనాడూ ఈ దేశం ఆమోదించలేదు. ప్రజలే వారిని తొలగించారు’ అని ఆయన అన్నారు. జూన్‌ 4న కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, హర్యానా ప్రతిచోటా వారు సీట్లను కోల్పోనున్నారని తెలిపారు. పంజాబ్‌లో, ఢిల్లీలో వారికి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఢిల్లీలోని ఏడు సీట్లు ఇండియా బ్లాక్‌ గెలుస్తుందని చెప్పారు. ఇండియా బ్లాక్‌ అధికారం చేపడితే, ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
కేజ్రివాల్‌, భగవంత్‌ మాన్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంలో రోడ్లకిరువైపులా నిలిచిన ప్రజలకు అభివాదం చేస్తూ, వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. కేజ్రీవాల్‌ ప్రసంగం వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తల హర్షాతిరేకాలతో ఢిల్లీ వీధులు మార్మోగాయి. ఆప్‌ వలంటీర్లు పార్టీ పతాకాలు చేబూని, నినాదాలు చేస్తూ వాహనాన్ని అనుసరించారు. పార్టీ అభ్యర్ధి సాహి రామ్‌ పహల్వాన్‌కు మద్దతుగా దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలిలో ఇరుకు వీధుల గుండా రోడ్‌ షో సాగింది.
”జైలు నుండి విడుదలైన వెంటనే తిన్నగా మీ దగ్గరకే వచ్చాను. ఢిల్లీ ప్రజలను చాలా మిస్సయ్యాను. నా కోసం ప్రార్ధించిన కోట్లాదిమంది ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను.” అని కేజ్రివాల్‌ పేర్కొన్నారు. తన భార్య సునీత, పంజాబ్‌ సిఎం మాన్‌, తన మంత్రులు అందరూ తనను కలుసుకోవడానికి వచ్చేవారంటూ తాను జైల్లో వున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ”జైల్లో వుండగా కూడా ప్రజల సంక్షేమం గురించే మంత్రులను అడిగేవాడిని, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు నేను అరెస్టయ్యాను అని జైల్లో వున్నప్పుడు తెగ ఆలోచించేవాడిని. ప్రజలకు మంచి పాఠశాలలు, ఆస్పత్రులు కట్టడమే నా తప్పు. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు కల్పించా, కానీ జైల్లో 15రోజుల పాటు బిజెపి నాకు ఇన్సులిన్‌ ఆపేసింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని వారనుకున్నారు.” అని కేజ్రివాల్‌ పేర్కొన్నారు. తీహార్‌ జైల్లో వున్న మాజీ మంత్రులు మనీష్‌ శిసోడియా, సత్యేందర్‌జైన్‌లను గుర్తు చేసుకుంటూ, పాఠశాలలు, ఆస్పత్రుల తీరు మార్చింది వారేనన్నారు. ఢిల్లీ స్కూళ్ళ తీరును శిసోడియా మార్చారు, ఆయన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా చేయాలన్నారు. నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

➡️