ముగిసిన ఐదో విడత ప్రచారం –  రేపే పోలింగ్‌

May 19,2024 08:34 #2024 election
  •  రేపే పోలింగ్‌
  •  49 నియోజకవర్గాలు, 695 మంది అభ్యర్థులు
  •  ప్రముఖులు రాహుల్‌గాంధీ, రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతి ఇరానీ..పోటీ

ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత ప్రచార పర్వం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 49 నియోజకవర్గాలకు రేపు (సోమవారం) పోలింగ్‌ జరుగనుంది. మొత్తంగా 695 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి స్మతి ఇరానీ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో సహా పలువురు ప్రముఖులున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లోక్‌సభ స్థానం నుంచి బిజెపి తరుపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పోటీ చేయగా, సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్‌ మెహ్రౌత్రాను అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రౌత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్‌పి ఎమ్మెల్యేగా ఉన్నారు. బిఎస్‌పి తన అభ్యర్థిగా సర్వర్‌ మాలిక్‌ను ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యంత చర్చనీయాంశమైన స్థానాల్లో రారుబరేలీ లోక్‌సభ స్థానం ఒకటి. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక సీటు ఇదే. అప్పుడు సోనియా గాంధీ ఇక్కడి నుంచి గెలిచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ రారు బరేలీ నుంచి రాహుల్‌ గాంధీని పోటీకి దింపింది. బిజెపి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ దినేష్‌ ప్రతాప్‌ ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రి, ప్రస్తుత అమేథీ ఎంపీ స్మతి ఇరానీ మరోసారి ఇక్కడ నుంచి బిజెపి టికెట్‌పై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కెఎల్‌ శర్మను బరిలోకి దింపింది. బీఎస్పీ నాన్హే సింగ్‌ చౌహాన్‌ను తన అభ్యర్థిగా దింపింది.
బీహార్‌లోని హాజీపూర్‌ లోక్‌సభ స్థానం ఈ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్థానాల్లో ఒకటి. ఇక్కడి నుంచి ఎల్‌జేపీ (ఆర్‌)కు చెందిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్‌డిఎ నుంచి పోటీ చేస్తున్నారు. హాజీపూర్‌ స్థానం నుంచి శివచంద్ర రామ్‌కు ఆర్‌జెడి టిక్కెట్టు ఇచ్చింది. శివచంద్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
కాశ్మీర్‌ లోయల్లోని పర్వతాలపై మంచు కురుస్తున్నప్పటికీ, ఇక్కడ రాజకీయ ఉష్ణోగ్రత వేడిగా ఉంది. కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పోటీ చేయడంతో ఈ స్థానం ప్రత్యేకత సంతరించుకుంది. మెహబూబా ముఫ్తీ పార్టీ పిడిపి నుంచి ఫయాజ్‌ అహ్మద్‌తో ఒమర్‌ తలపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌ (14)లో మోహన్‌లాల్‌గంజ్‌, లక్నో, రారుబరేలీ, అమేథీ, జలౌన్‌, ఝాన్సీ, హమీర్‌పూర్‌, బందా, ఫతేపూర్‌, కౌశంబి, బారాబంకి, ఫైజాబాద్‌, కైసర్‌గంజ్‌, గోండా స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మహారాష్ట్ర (13)లో ధూలే, దిండోరి, నాసిక్‌, పాల్ఘర్‌, భివాండి, కళ్యాణ్‌, థానే, ముంబై నార్త్‌, ముంబై నార్త్‌ – వెస్ట్‌, ముంబై నార్త్‌ – ఈస్ట్‌, ముంబై నార్త్‌ – సెంట్రల్‌, ముంబై సౌత్‌ – సెంట్రల్‌, ముంబై సౌత్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌ (7)లో బంగాన్‌, బరాక్‌పూర్‌, హౌరా, ఉలుబెరియా, శ్రీరాంపూర్‌, హుగ్లీ, ఆరంబాగ్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. బీహార్‌ (5)లో సీతామర్హి, మధుబని, ముజఫర్‌పూర్‌, సరన్‌, హాజీపూర్‌ స్థానాలకు, ఒరిస్సా (5)లో బర్గర్‌, సుందర్‌ఘర్‌, బోలంగీర్‌, కంధమాల్‌, అస్కా స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. జార?ండ్‌ (3)లో చత్రా, కోదర్మా, హజారీబాగ్‌ స్థానాలకు, జమ్మూ కాశ్మీర్‌ (1)లో బారాముల్లా, లడఖ్‌ (1)లో లడఖ్‌ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాలలో 13 స్థానాలకు ఈదశలో పోలింగ్‌ జరగనుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు ముగుస్తాయి. ఈ విడతతో జమ్మూ కాశ్మీర్‌తో పాటు లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఓటింగ్‌ ముగియనుంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.

➡️