పోలీస్‌ స్టేషన్‌ లో నవదంపతులు మృతి.. స్టేషన్‌ ను తగలబెట్టిన గ్రామస్థులు

May 18,2024 16:45 #bhihar, #newlyweds died

బీహార్‌: ఓ వ్యక్తి తన భార్య చనిపోవటంతో.. 14 ఏళ్ల తన మేనకోడలును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మైనర్‌ అయినటువంటి తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అతన్ని, అతని మైనర్‌ భార్యను విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లారు. విచారణ సమయంలో ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. వాళ్లిద్దరూ అంటే భర్త, మైనర్‌ భార్య పోలీస్‌ స్టేషన్‌ లో చనిపోయారు. దీంతో బీహార్‌ రాష్ట్రం అరారియా జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో పెళ్లి వాళ్ళ బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌ కు తరలివచ్చారు. పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త జంట చనిపోయారు అని.. ఆత్మహత్య చేసుకున్నారు అని పోలీసులు అంటుంటే.. కాదు కొట్టి చంపారని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే కొత్త జంట మరణాలపై పోలీసులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బంధువులు, గ్రామస్తులు పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ను తగలబెట్టారు. పరిస్థితి అదుపు తప్పటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు వీదుల్లో విధ్వంసానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు హుటాహుటిన స్పాట్‌ కు చేరుకుని కొత్త దంపతుల మరణాలపై విచారణ చేస్తామని హామీ ఇవ్వటంతోపాటు..బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పటంతో కొంత వరకు శాంతించారు ఆందోళనకారులు. దీనిపై బీహార్‌ ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అయితే దంపతుల మరణాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

➡️