నిప్పుల వర్షం- వడగాడ్పులతో పిట్టల్లారాలుతున్న జనం

Jun 1,2024 08:22 #Bihar, #dies, #sunstroke

బీహార్‌లో 10 మంది పోలింగ్‌ సిబ్బందితో సహా 14 మంది బలి
ఉత్తరప్రదేశ్‌లో 166 మంది, ఒడిశాలో 10 మంది, జార్ఖండ్‌లో నలుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో నిప్పుల వర్షం కురుస్తోంది. గత వారం రోజుల నుంచి ఉత్తరభారతంలో 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పులకు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం ఒక్కరోజే వివిధ రాష్ట్రాల్లో 50 మందికిపైగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. బీహార్‌లో 10 మంది పోలింగ్‌ సిబ్బందితో సహా 14 మంది మరణించగా, ఉత్తరప్రదేశ్‌లో 166 మంది, ఒడిశాలో 10 మంది, జార్ఖండ్‌లో నలుగురు మరణించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఎన్నికల విధుల కోసం నియమించిన ఏడుగురు భద్రతా సిబ్బంది వడగాల్పులతో మరణించారని ఒక విలేకరి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అధికారులు ధ్రువీకరించలేదు.
బీహార్‌లో శుక్రవారం మధ్యాహ్నానికి గత 24 గంటల్లో 10 మంది పోలింగ్‌సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారని బీహార్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భోజ్‌పూర్‌లో ఐదుగురు, రోహతస్‌లో ముగ్గురు ఎన్నికల సిబ్బంది మరణించారు. కైమూర్‌, ఔరంగాబాద్‌ జిల్లాల్లో ఒకొక్కరు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో నలుగురు చనిపోయారు. రాష్ట్రంలోని బక్సర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవగా, చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల కంటే అధికంగా నమోదైంది. జూన్‌ 8 వరకూ అన్ని పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. బీహార్‌లో శనివారం చివరి దశలో భాగంగా 8 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
జార్ఖండ్‌లో వడగాడ్పులకు నలుగురు మరణించారు. 1,326 మంది వడదెబ్బకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరారు. పాలములో ముగ్గురు, జంషెడ్‌పూర్‌లో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని దల్తోంగంజ్‌, గర్హావ ప్రాంతాల్లో అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది వడదెబ్బ కారణంగా మరణించారు.
యుపిలో రెండు రోజుల్లో 166మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో గత రెండు రోజుల్లోనే 166 మంది మరణించారు. మధ్య ఉత్తరప్రదేశ్‌లో వేడిగాలుల కారణంగా 47 మంది చనిపోయారు. వారణాసి, పరిసర జిల్లాల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్‌లో 11 మంది, కౌశాంబిలో తొమ్మిది మంది, ప్రతాప్‌గఢ్‌లో ఒకరు, గోరఖ్‌పూర్‌లో ఒక బాలికతో సహా ముగ్గురు మరణించారు. అంబేద్కర్‌ నగర్‌లో నలుగురు, శ్రావస్తి, గోండాలో ఒక్కొక్కరు వడదెబ్బకు, ఝాన్సీలో ఆరుగురు చనిపోయారు. ఘజియాబాద్‌లో ఒక శిశువుతో సహా నలుగురు, ఆగ్రాలో ముగ్గురు, రాంపూర్‌, లఖింపూర్‌ ఖేరీ, పిలిభిత్‌, షాజహాన్‌పూర్‌లో ఒక్కొక్కరు మరణించారు. సహరాన్‌పూర్‌లోని శివాలిక్‌ కొండల్లో కార్చిచ్చు రేగింది. ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో, ఆ ప్రాంతంలో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నో, ఝాన్సీ, లఖింపూర్‌, రారుబరేలీలో కరెంటు కోతతో ప్రజలు,వ్యాపారులు ఆందోళనకు దిగారు. అయోధ్య, గోండాలో కూడా నిరసనలు తెలిపారు.
మరో 2 రోజుల పాటు వడగాల్పులు
దేశంలోని ఉత్తర, వాయువ్య, మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. తరువాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. దేశంలో అనేక ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో బాధపడుతుండగా, మణిపూర్‌, అస్సాంలు రెమాల్‌ తుపాను కారణంతో భారీ వర్షాలకు గురవుతున్నాయి. శుక్రవారం అనేక ప్రాంతాలు జలమయ్యాయి. రాబోయే ఐదు రోజుల్లో అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, సిక్కింలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మే 31 నుంచి జూన్‌ 2 వరకూ కేరళ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, తమిళనాడు, కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.

➡️