దిండిగల్‌లో ఎర్ర జెండా- సిపిఎం అభ్యర్థి ఆర్‌. సచ్చిదానందం

చెన్నయ్ నుంచి ప్రత్యేక ప్రతినిధి :తమిళనాడులోని దిండిగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి ఎర్ర జెండా ఎగరనున్నది. సిపిఎం తరపున ఆర్‌.సచ్చిదానందం బరిలో దిగారు. ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ రాష్ట్రాలపై దాడిని, ప్రజాస్వామ్య, లౌకికవాదం, రాజ్యాంగం, సమాఖ్యవాదంపై దాడిని ఖండిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆయన తరపున సినీనటి రోహిణి, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌, రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తున్నారు.
పర్యాటక కొడైకెనాల్‌ ఇక్కడే
దిండిగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మలయాళీలకు ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాలకు, దేశ, విదేశీ పర్యటలకులకు సుపరిచితమైన పళని, కొడైకెనాల్‌ ఉన్నాయి. 2019లో డిఎంకెకు చెందిన పి వేలుసామి ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో దిండిగల్‌ నుంచి గెలుపొందారు. ఈసారి డిఎంకె సారధ్యంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ ఫ్రంట్‌లో భాగంగా సిపిఎం పోటీ చేస్తోంది. అభ్యర్థిగా జిల్లా కార్యదర్శి ఆర్‌.సచ్చిదానంద్‌ ఉన్నారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అమ్ము స్వామినాథన్‌ను లోక్‌సభకు పంపిన దిండిగల్‌లో ఇప్పుడు 18,66,403 మంది ఓటర్లు ఉన్నారు.
సిపిఎంకు బలమైన పునాది
2019లో ఎన్డిఎ ప్రధాన మిత్రపక్షంగా ఉన్న అన్నాడిఎంకె ఈసారి విడిగా పోటీ చేస్తోంది. సచ్చిదానంద్‌ గెలుపు ఖాయమని అంటున్నారు. ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెల్లయి ముబారక్‌ అన్నాడిఎంకె తరపున రెండు ఆకుల గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఈ సీటును బిజెపి మిత్రపక్షమైన పిఎంకెకి కేటాయించారు. పిఎంకె అభ్యర్థి తిలక్‌ భామ. వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రమైన దిండిగల్‌లో సిపిఎంకు బలమైన పునాది ఉంది. పళని, ఒట్టెంఛత్రం, ఏత్తూరు, నిలకోట, నట్టం, దిండిగల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం డిఎంకె, అన్నాడిఎంకెకి ఎమ్మెల్యేలు ముగ్గురు చొప్పున ఉన్నారు. దిండిగల్‌లో 1967, 1977, 1989, 2001, 2006, 2011 ఎన్నికల్లో సిపిఎం ప్రతినిధులు విజయం సాధించారు. 1977, 1980, 1989 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పళని లో సిపిఎం ప్రాతినిధ్యం వహించింది.

➡️