ముదురుతున్న మాల్దీవుల వివాదం

Jan 9,2024 10:27 #Maldives dispute, #simmering
  • ప్రధాని మోడీపై వ్యాఖ్యలకు భారత్‌ అభ్యంతరం
  • మాల్దీవుల దౌత్యవేత్తను పిలిపించుకున్న విదేశాంగ శాఖ
  • ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మాల్దీవుల ప్రభుత్వం

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల వివాదాస్పద వ్యాఖ్యలతో తలెత్తిన వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు స్పష్టం చేసిన కొద్ది సేపటికే భారత్‌లోని మాల్దీవుల దౌత్యవేత్త ఇబ్రహీం షాహీబ్‌ను విదేశాంగ శాఖ పిలిపించుకుని తన అభ్యంతరాన్ని తెలియజేసింది. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్‌లో పర్యటించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంపై మాల్దీవుల మంత్రులు ప్పందిస్తూ మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్‌ను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా రూపొందించేందుకు భారత్‌ యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులు మరియం షివునా, మల్షా షరీఫ్‌, అబ్దుల్లా మజూంలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

అనుచిత వ్యాఖ్యలు చేసి, సస్పెండైన తమ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని మాల్దీవుల ప్రభుత్వం భారత హై కమిషనర్‌ మును ముహవర్‌కు తెలియచేసింది. ఆ వ్యాఖ్యలు తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. భాగస్వాములందరితో ముఖ్యంగా పొరుగు దేశాలతో సానుకూల, నిర్మాణాత్మక చర్చలు, సంబంధాలు కొనసాగించేందుకు మాల్దీవులు కట్టుబడి వుందని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపేందుకు హై కమిషనర్‌ మును మహవర్‌ మాల్దీవుల రాయబారి అలీ నజీర్‌ మహమ్మద్‌తో భేటీ అయ్యారని భారత హై కమిషన్‌ కార్యాలయం ఎక్స్‌లో తెలిపింది.

భారత్‌తో దౌత్య వివాదం కొనసాగుతుండగానే మరోపక్క మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు ఐదు రోజుల అధికార పర్యటన నిమిత్తం చైనాకు బయలుదేరి వెళ్ళారు. ఇరు దేశాల అధ్యక్షులు చర్చలు జరిపి, వాణిజ్యం, వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక, ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారని భావిస్తున్నారు.

➡️