క్షీణించిన అతిషి ఆరోగ్యం .. ఢిల్లీ మంత్రిని ఆసుపత్రికి తరలించిన సిబ్బంది

న్యూఢిల్లీ : ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్న ఆ రాష్ట్ర మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. షుగర్‌ స్థాయిలు 36కు పడిపోవడంతో మంత్రి ఢిల్లీలోని లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ ఆసుపత్రిలో చేరినట్లు ఆప్‌ నాయకులు సౌరభ్‌ భరద్వాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఢిల్లీ నీటి వాటాను హర్యానా ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ… అతిషి చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారానికి ఐదో రోజుకు చేరింది. ఆమె ఆసుపత్రిలో చేరడంతో ఈ దీక్ష ముగిసింది. అతిషి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆమె ఐసియులో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం రాత్రే ఆమెను ఆసుపత్రిలో చేరాలని సలహా ఇచ్చామని, ఆమె నిరాకరించారని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె పరిస్థితి మరింతగా క్షీణించడం, మగతగా ఉండటంతో ఆమెను ఆసుపత్రితో చేర్చినట్లు తెలిపారు. ఈ నెల 21న అతిషి దీక్ష ప్రారంభమయింది. ఆమె ఆసుపత్రిలో చేరిన తరువాత ఈ దీక్ష ముగించినట్లు ఆప్‌ రాజ్యసభ ఎంపి సంజరు సింగ్‌ చెప్పారు. ఢిల్లీకి హర్యానా నుంచి న్యాయమైన నీటి వాటాను విడుదల చేయాలని కోరుతూ ఆప్‌ ఎంపిలందరూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తారని సంజరు సింగ్‌ తెలిపారు. ఇదే అంశాన్ని ఆప్‌, దాని మిత్రపక్షాలు పార్లమెంట్‌లో లేవనెత్తుతాయని ఆయన చెప్పారు.

➡️