అన్నదాతల పోరుబాట 2.0 

Feb 12,2024 10:51 #Farmers Protest, #SKM leaders
skm demand on msp for farmers
  • 16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెకు సంయుక్త కిసాన్‌ మోర్చా సన్నాహాలు
  • ముందస్తు నిర్బంధం, ఆంక్షలతో ప్రభుత్వం 
  • మార్చి13న ఛలో ఢిల్లీకి కొన్ని సంఘాల పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికుల నిరంకుశ విధానాలపై కర్షకలోకం రెండో విడత మహోద్యమానికి సన్నద్ధమవుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి ఏడాదిపాటు చారిత్రాత్మక పోరాటం సాగించిన సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 16న గ్రామీణ బంద్‌, రంగాలవారీ పారిశ్రామిక సమ్మెకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ నెల 13న సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కెఎంఎం) ఆధ్వర్యంలో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల రైతులు ‘ఢిల్లీ చలో’ చేపట్టనున్నారు. ఈ ర్యాలీకి 2,500 ట్రాక్టర్లతో 20 వేల మంది రైతులు రావచ్చునని ఢిల్లీ పోలీసుల అంచనా. అంబాలా-శంభు, ఖనౌరీ-జింద్‌, దబ్వాలి సరిహద్దులను బారీకేడ్లు, ఇనుప కంచెలతో పోలీసులు దిగ్బంధించారు. అయితే ఈ 13న చేపట్టే ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి.డిమాండ్లివే..పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించే చట్టం తేవాలి. వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న ఇతర సమస్యలను పరిష్కరించాలి. రైతుల నుంచి వివిధ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న భూములను అభివృద్ధి చేయాలి. అలా చేయకపోతే ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలి. లోక్‌సభ ఎన్నికల లోపు కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు ఇచ్చిన హామీలను అన్నిటినీ నెరవేర్చాలి.

➡️