‘మోడీ రామరాజ్యం’లోఅణగారిన ప్రజలకు ఉద్యోగాల్లేవు ! : రాహుల్‌ విమర్శ

Feb 22,2024 10:34 #Modi government, #Rahul Gandhi

కాన్పూర్‌ : జనాభాలో 90 శాతంగా వున్న దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు తగినన్ని ఉద్యోగాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సృష్టించడం లేదని కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ బుధవారం విమర్శించారు. రామరాజ్యంగా చెప్పుకునే మోడీ ప్రభుత్వ హయాంలోనే వారి పట్ల వివక్ష కనబడుతోందన్నారు. ‘ఇదేమీ రామరాజ్యం? వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు వీరికెవరికీ ఉద్యోగాల్లేవు.’ అని ఆయన భారత్‌ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విమర్శించారు. ‘దేశంలో 50శాతం జనాభా వెనుకబడిన వర్గాలు. 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలు. మీరెంత అరిచి గీ పెట్టినా మీకు ఈ దేశంలో ఉపాధి దొరకదు. మీకు ఉద్యోగాలు రావాలని మోడీ కోరుకోవడం లేదు.’ అని రాహుల్‌ విమర్శించారు. మీడియాలో కానీ, బడా పరిశ్రమల్లో కానీ వెనుకబడిన వర్గాలవారెవరూ లేరని, అధికార యంత్రాంగంలోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు. ఇటీవల జరిగిన రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంతమంది దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు వున్నారు. గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు. దళితుడైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్‌ను లోపలకు అనుమతించలేదని రాహుల్‌ గుర్తు చేశారు.

➡️