తృణమూల్‌, వామపక్షాలు కలిసే పరిస్థితే లేదు !

Jan 25,2024 07:15 #Interview, #Sitaram Yechury
sitaram yechury on lenin 100th death anniversary seminar
  • రాష్ట్రాల స్థాయిలోనే సీట్ల సద్దుబాటు జరగాల్సి వుంది
  • రోజువారీ సమస్యలే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి
  • పత్రికా ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు వుండబోదని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. బుధవాంర ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా వేదిక భాగస్వాముల మధ్య జరుగుతున్న చర్చలు, వామపక్షాల వైఖరి వంటి అంశాల గురించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. సంఘటితమవుతున్న హిందూత్వ శక్తులను ప్రతిపక్షాలు ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..

పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సద్దుబాటు చర్చల పరిస్థితి ఏమిటి ?

ప్రజాస్వామ్య రక్షణ కోసం, భారతదేశ లౌకిక ప్రజాతంత్ర స్వభావ పరిరక్షణ కోసం మేం కృషి చేస్తామని ఎప్పుడూ చెబుతూనే వస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాది అదే వైఖరి. పశ్చిమ బెంగాల్‌కు కూడా ఇది వర్తిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో, బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌లను ఓడించేందుకు కాంగ్రెస్‌, ఇతర లౌకిక మిత్రపక్షాలతో కలిసి పనిచేయడం ద్వారా గరిష్టంగా ఓట్లను గెలుచుకోవడానికి మేం కృషి చేశాం. తృణమూల్‌ కాంగ్రెస్‌ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. మమతా బెనర్జీ మమ్మల్ని తీవ్రవాద సంస్థ అని నిందించారు. ఇంకా చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు వాటికి సంబంధించిన చర్చలోకి వెళ్లాలనుకోవడం లేదు. వారెలాంటి వైఖరి తీసుకుంటారో అది వారిష్టం. కానీ మా వైఖరి స్పష్టం. బెంగాల్‌ యువత కూడా పెద్ద ఎత్తున స్పందిస్తుందని భావిస్తున్నా. జనవరి 8న జరిగిన బ్రిగేడ్‌ పరేడ్‌ ర్యాలీ కూడా మా అంచనాలకు మించి జరిగింది.

అంటే ఇక పొత్తుకు ‘నో’ అని చెబుతారా ?

తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి పని చేసే పరిస్థితే వుండబోదని అనిపిస్తోంది. దీనివల్ల బిజెపి మాత్రమే లాభపడుతుందని కూడా మేం భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకత కూడా బిజెపికి లాభించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తలెత్తిన హింసను పరిగణనలోకి తీసుకుంటే, బెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ను కూడా ఓడించాల్సి వుంది.

రామ మందిరం ప్రారంభంతో నెలకొన్న హర్షాతిరేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ప్రతిపక్షాలు 2024 ఎన్నికల ప్రచారాన్ని కొంత ప్రతికూలతతో ప్రారంభిస్తున్నాయని మీరు భావిస్తున్నారా ?

ఇది ఊహించిందే. దీన్ని ఎన్నికలకు పెద్ద ఎత్తున వాడుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఇది కేవలం మా నిర్ధారణ మాత్రమే కాదు, శంకరాచార్యులు కూడా మందిరం ప్రారంభోత్సవానికి ఎంచుకున్న సమయాన్ని ప్రశ్నించారు. సగం నిర్మాణం మాత్రమే పూర్తయిన ఆలయంలో ప్రాణ ప్రతిష్ట ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు.

మీరు దీన్ని ఎలా ప్రతిఘటిస్తారు ?

ఇది హిందూత్వను సంఘటితం చేయడమే, గత దఫా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మీరు చూశారు. దీన్ని ఎలా ఎదుర్కొనాలన్న విషయమై మేం చాలా స్పష్టంగా వున్నాం. ఇండియా పక్షాలకూ ఈ అంశంపై ఒక ఉమ్మడి అవగాహన వుంది. ప్రజల రోజువారీ జీవనోపాధి అంశాలే అత్యంత ముఖ్యమైన అంశాలుగా ఆవిర్భవిస్తాయి. ఈ రామ మందిరం అంశం భావోద్వేగాలతో కూడినదై వుండవచ్చు. అయినా, ప్రజలకు తమకు నచ్చిన విశ్వాసాన్ని ఎంచుకునే హక్కు వుంది. ఆ హక్కును కాపాడేందుకు మేం కృషి చేస్తున్నాం. అయితే, ప్రస్తుత జీవన పరిస్థితులు ఏమిటన్నది ఇక్కడ ప్రశ్నగా వుంది. గత అర్ధ శతాబ్దంలో అత్యధిక స్థాయిలో నిరుద్యోగం నెలకొన్న పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అడ్డూ అదుపు లేని ధరల పెరుగుదల, సరైన ఉద్యోగాలు లేక స్వస్థలాలకు మళ్ళుతున్న వైనం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. బతుకు సాగించడం కోసం నగరాలకు వెళ్ళిన ప్రజలు తిరిగి గ్రామాలకు మళ్ళడమనేది అరిష్టానికి సంకేతం. ఇటువంటి పరిస్థితుల్లో, గ్రామీణ నిరుపేదలకు ఏకైక జీవనాడిగా వున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ)పై వరుసగా దాడి జరుగుతునే వుంది.

మీరు చెప్పింది నిజమైనట్లైతే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయాన్ని మీరెలా చూస్తారు?

ఆ మూడు రాష్ట్రాలు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ల్లో బిజెపిపై పోటీ చేసిన కాంగ్రెస్‌ తన ఓట్లను నిలబెట్టుకుంది. బిజెపి పొందిన అదనపు ఓట్ల గురించి ఇక్కడ ప్రశ్నించుకుంటే అది హిందూత్వ సంఘటితమే. అయితే,, కర్ణాటక, తెలంగాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో బిజెపి ఓడిపోయింది. భారతదేశ ఓటర్లందరూ ఒకే దారిలో వెళుతున్నట్లైతే ఇది జరగదు. హిందూత్వ ఏకీకరణకు, దాన్ని వ్యతిరేకించడానికి మధ్య కొంత తేడా వుందన్నది వాస్తవం. గతేడాది జూన్‌ 23న ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చాయి. ఏడు మాసాలైంది, ఇప్పటివరకు ఇండియా భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సద్దుబాటు ఒప్పందం జరగలేదు.

ఇప్పటికే ఆలస్యమవలేదంటారా ?

చర్చలు జరుగుతున్నాయి. ఇండియా పక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది ? రాష్ట్ర స్థాయిలో సీట్ల విభజన ఖరారై, ఆమోద ముద్ర పొందాల్సి వుంది. ప్రతి రాష్ట్రంలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు కేరళనే తీసుకుంటే, అక్కడ, సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటనకు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌కు మధ్య ప్రత్యక్షంగా పోటీ నెలకొంది. ఇక అక్కడ ఏ రకరమైన సీట్ల విభజన గురించి మాట్లాడాల్సి వుంటుంది? ఈ రెండు ఫ్రంట్‌ల మధ్య ముఖాముఖి పోటీ వున్నందున అక్కడ బిజెపి ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచే పరిస్థితి వుండదు. మహారాష్ట్రలో మహారాష్ట్ర వికాస్‌ అగాధి, బీహార్‌లో మహాఘట్‌బంధన్‌, తమిళనాడులో డిఎంకె నేతృత్వంలోని సెక్యులర్‌ ఫ్రంట్‌ వున్నాయి. కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ ఈ చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా పరిస్థితులన్నీ ఒక కొలిక్కి వస్తాయని కచ్చితంగా చెప్పగలను.

అయితే, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, అలాగే పశ్చిమ బెంగాల్‌ వంటి కొన్ని సమస్యాత్మక రాష్ట్రాల గురించి ?

పశ్చిమ బెంగాల్‌ గురించి ఇప్పటికే చెప్పాను. అలాగే పంజాబ్‌కి సంబంధించి కూడా అక్కడ అలాంటి పరిస్థితులే వున్నాయి. అక్కడ అందరూ ఒక్కతాటిపైకి వస్తే, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్షానికి (అకాలీదళ్‌, బిజెపి) మాత్రమే సాయపడుతుంది. కాబట్టి, రాష్ట్రంలో పరిస్థితిని నిర్దిష్టంగా, సమగ్రంగా అంచనా వేయాలి. యుపిలో కూడా ప్రధాన పార్టీల మధ్య చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి.

భారత్‌ జోడో యాత్రలో మీరు చేరతారా ?

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ఇద్దరూ నన్ను ఆహ్వానించారు. ఎక్కడ, ఎప్పుడు ఆ యాత్రలో పాలు పంచుకోగలమో ఇంకా చూడాల్సి వుంది.

‘ఇండియా’ ఫోరం భాగస్వామ్య పక్షాలు ఇంకా సంయుక్త ర్యాలీ లేదా బహిరంగ సభ నిర్వహించాల్సి వుంది. మరి అది కూడా ఆలస్యమవలేదా ?

మనం వరుసగా బహిరంగ సభలు నిర్వహించాల్సిన అవసరం వుందని, రాష్ట్ర స్థాయిలో సీట్ల సద్దుబాటు చేసుకోవాల్సి వుందని, ఆ ప్రాతిపదికనే మన దార్శనికతను ప్రకటించాల్సి వుందని ఇండియా ఫోరం మొట్టమొదటి సమావేశం నుండి నేను చెబుతూనే వస్తున్నాను. కానీ ఇంతవరకు ఇది జరగలేదు. అయితే, ఫిబ్రవరికల్లా ఈ క్రమం మేం ప్రారంభించగలమని భావిస్తున్నాను.

➡️