బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేముంది? : నవీన్‌ పట్నాయక్‌ ఎద్దేవా

May 24,2024 23:51 #BJP, #comentes, #Naveen Patnaik

భువనేశ్వర్‌ : బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేలేకుండా పోతోందని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం విమర్శించారు. తన ఆరోగ్యంపైనా కాషాయ పార్టీ దుష్ప్రాచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, ప్రతీ విషయానికి మాజీ వ్యక్తిగత కార్యదర్శి వికె పాండియన్‌పై ఆధార పడుతున్నారంటూ ఇటీవల బిజెపి నాయకులు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. పాండియన్‌ను ముఖ్యమంత్రి బందీఖానా నుంచి విడిపించాలని రాష్ట్ర డిజిపికి లేఖ కూడా రాసారు. ఈ నేపథ్యంలో తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ, బిజెపి పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తోందని నవీన్‌ పేర్కొన్నారు. ‘బిజెపి తప్పుడు ప్రచారానికి హద్దే లేకుండా పోతోంది. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. నెల రోజులుగా రాష్ట్రమంతటా ప్రచారం చేస్తున్నాను’ అని ఆయన మీడియాతో అన్నారు. బిజెపి ఆరోపణను పాండియన్‌ కూడా తీవ్రస్థాయిలో ఖండించారు. బిజెపి ఆరోపణలు చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా అసత్యాల బదులు ఎవైనా కొత్త ఆలోచనలు చేయాలంటూ బిజెపి నేతలకు ఆయన చురకలంటించారు.

➡️