Election commissioners : స్టే విధించేందుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ :   ఎన్నికల కమిషనర్‌లను నియమించే చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఈ దశలో స్టే విధిస్తే గందరగోళానికి దారితీస్తుందని పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం ప్రకారం.. నియమితులైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులపై ఎటువంటి ఆరోపణలు లేవని కోర్టు పేర్కొంది.

ఎన్నికల సంఘం కార్యనిర్వాహక అధికారి కింద ఉందని చెప్పలేమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రం రూపొందించిన చట్టం తప్పు అని భావించలేమని, నియమితులైన వ్యక్తులపై కూడా ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది.  ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ సమయంలో సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని పేర్కొంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లు 2023ని గతేడాది పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రపతి ఆమోదం పొందింది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్‌ మంత్రితో ఎన్నికల కమిషనర్‌లను ఎన్నుకునేందుకు కమిటీని నియమించాలని   నూతన చట్టం సూచించింది.

దీంతో ఈ కమిటీ నిష్పాక్షితపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  కమిటీ ఎంపిక అనంతరం లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ ఎంపిక ముందు రోజు తనకు పరిశీలన కోసం 212 పేర్లను ఇచ్చారని,  సమావేశానికి ముందు ఆరు పేర్లతో షార్ట్‌లిస్ట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.  కొత్త చట్టంతో కమిటీ ఎంపికను ‘లాంఛనప్రాయం’ చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

➡️