ఇదేం తీరు ?

ఇసిపై మండిపడిన ది హిందూ, డక్కన్‌ హెరాల్డ్‌
ఎండగట్టిన సంపాదకీయాలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై రెండు ఆంగ్ల పత్రికలు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణలో ఇసి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ మేరకు ది హిందూ, డక్కన్‌ హెరాల్డ్‌ పత్రికలు తమ సంపాదకీయాల్లో ఈసీ తీరును ఎండగట్టాయి.
ఎన్నికల ప్రసంగాల్లో మతపరమైన అంశాలు లేవనెత్తవద్దని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఈసీ తాజాగా రాసిన లేఖను ‘ది హిందూ’ పత్రిక సంపాదకీయం ప్రస్తావించింది. అయితే ఇప్పటికే ఆలస్యమైందని, తాను నిస్పాక్షికంగా వ్యవహరిస్తున్నానని ప్రజలకు ఈసీ నచ్చచెప్పలేకపోయిందని వ్యాఖ్యానించింది. డక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక మరింత కఠిన పదజాలంలో ఈసీపై మండిపడింది. అన్ని విషయాల్లో ఈసీ వైఫల్యం కొట్టచ్చినట్లు కన్పిస్తోందని తెలిపింది.
అసమర్థత చాటుకున్న ఇసి : ది హిందూ
‘బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఈసీ లేఖలు రాయడం గుడ్డిలో మెల్ల మాదిరిగా ఉంది. ఈసీ తన అసమర్థత కారణంగా ఓటర్లను నిరుత్సాహానికి గురిచేసింది. సమర్ధతతో, నిస్పాక్షికతతో సజావుగా ఎన్నికలు నిర్వహించి కాపలా కుక్క మాదిరిగా ఉండాల్సిన ఈసీ తన అసమర్థతను చాటుకుంది. దీనంతటికీ కమిషన్‌ సభ్యులను నియమించిన పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నేతలు శోభా కరంద్లజే, దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకులు సుప్రియా ష్రినాటే, రణదీప్‌ సూర్జివాలాపై ఈసీ తీసుకున్న చర్యల కారణంగా కొంత నిస్పాక్షికత కన్పించినా అది సరిపోదు’ అని ‘ది హిందూ’ సంపాదకీయం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై వచ్చిన ఫిర్యాదులు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నయని ఆ పత్రిక గుర్తు చేసింది.
దాని పనులు కోర్టులు చేస్తున్నాయి : డక్కన్‌ హెరాల్డ్‌
ఈసీ చేయాల్సిన పనులను ఇప్పుడు న్యాయస్థానాలు చేస్తున్నాయని డక్కన్‌ హెరాల్డ్‌ వ్యాఖ్యానించింది. ‘అభ్యంతరకరమైన, అపవాదులు వేసే ప్రకటనలు ఇవ్వవద్దని కలకత్తా హైకోర్టు బీజేపీని ఆదేశించింది. ఫిర్యాదులపై ఈసీ సకాలంలో స్పందించడం లేదని చెప్పడానికి ఇదో ఉదాహరణ. కొల్‌కతా కేసు ఒక్కటే కాదు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి సకాలంలో చర్యలు తీసుకోవడంలో ఈసీ వైఫల్యం అనేక సందర్భాల్లో బహిర్గతమైంది. ఒకవేళ చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఛోటా నాయకుల పైనే. అది కూడా సకాలంలో కాకుండా ఆలస్యంగా తీసుకున్నది. గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు విద్వేష ప్రసంగాలు, మతపరమైన ప్రకటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ ముస్లింలపై విషం చిమ్ముతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ తన స్వతంత్రతను తానే నీరుకారుస్తోంది. ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలం కావడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. రాజకీయ పార్టీలకు బుధవారం జారీ చేసిన సాధారణ మార్గదర్శకాలు ఈ అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నాయి’ అని తెలిపింది.

➡️