అంత్యక్రియలకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

అగర్ మాల్వా : మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ముగ్గురు పిల్లలు నదిలో మునిగి మరణించారని పోలీసులు శనివారం(మే 25న) తెలిపారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్దా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని నల్ఖెడ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శశి ఉపాధ్యాయ తెలిపారు. కుటుంబ సభ్యుల మరణించిన నేపథ్యంలో అంత్యక్రియల తరువాత కొంతమంది మహిళలు లఖుందర్ నదిలో స్నానానికి వెళ్లారు. వీరితో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. మహిళలు స్నానం చేసి ఒడ్డుకు తిరిగి వచ్చే సరికి పిల్లలు కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు గాలింపు చేపట్టారు.  రాష్ట్ర విపత్తు అత్యవసర ప్రతిస్పందన దళం (SDERF) సిబ్బంది పిల్లల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారి తెలిపారు. మృతి చెందిన పిల్లలు మోను (7), అతని సోదరి ముస్కాన్ (8), వారి బంధువు పంకజ్ (7)గా పోలీసులు గుర్తించారు.

➡️