యుపిలో ఘోర ప్రమాదం – చెరువులో ట్రాక్టర్‌ పడి 24 మంది మృతి

– మరో 20 మందికి గాయాలు

– గంగా నదీ స్నానాలకు వెళ్తుండగా దారుణం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాశ్‌గంజ్‌ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. కాదరజ్‌గంజ్‌ వద్ద గంగా నదిలో స్నానాలు చేసేందుకు యాత్రికులు వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ ట్రాలీ రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోవడంతో 24 మంది చనిపోయారు. మరణించినవారిలో 8 మంది చిన్నారులున్నారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటా జిల్లాలోని జైతారా గ్రామానికి చెందిన వీరంతా పాటియాలి ా దరియావ్‌గంజ్‌ రోడ్డు మీదుగా కాదర్‌గంజ్‌ వెళ్లేందుకు ట్రాక్టర్‌ ట్రాలీలో బయల్దేరారు. అయితే మార్గమధ్యలో గదాహి గ్రామ సమీపాన రోడ్డు పక్కన ఉన్న చెరువలోకి ట్రాక్టరు బోల్తా కొట్టింది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ట్రాలీ మొత్తం నీటలో మునిగిపోవడంతో ఊపిరి అందక యాత్రికుల్లో 22 మంది చనిపోయారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారిలో 20 మంది పైగా గాయపడ్డారని, వీరిని సమీప ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టరులో 45 మంది యాత్రికులు ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున యుపి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున సాయాన్ని ప్రకటించింది. ఈ ఘోర ప్రమాదం పట్ల సిపిఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ ఒక ప్రకటన పోస్టు చేసింది. తీర్థయాత్రకు వెళ్తున్న యాత్రికులు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సిపిఎం పేర్కొంది. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

➡️