ఇప్పటివరకు ట్రయలరే – మీరట్‌ ర్యాలీలో మోడీ

Apr 1,2024 10:24 #Meerut rally, #PM Modi

మీరట్‌ : గత పదేళ్లలో అభివృద్ధికి సంబంధించి ట్రయలర్‌ను మాత్రమే ప్రజలు చూశారని, రాబోయే ఐదేళ్లలో దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లబోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకోసం రోడ్‌మ్యాప్‌ను తమ ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఆదివారం నిర్వహించిన మొదటి ర్యాలీలో మోడీ ప్రసంగించారు. పదేళ్ల పాలనను ప్రధాని ట్రైలర్‌గా పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా ప్రపంచ సూచీలన్నింటిలో దేశం వెనుకబడి ఉండగా, వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి చేసెస్తామన్న మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మత అంశాలను తీసుకుని, సిఎఎ తదితర చట్టాలను అమలు చేస్తూ, మైనారిటీలపై విరుచుకుపడుతున్న ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో మరింతగా బరితెగిస్తుందా? అన్న ఆందోళన ఇప్పటికే సర్వత్రా నెలకొంది.
మూడో దఫా పదవీకాలాన్ని చేపట్టడానికి తమ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిందని ప్రధాని చెప్పారు. మొదటి వంద రోజుల్లో తీసుకోవాల్సిన ప్రధాన నిర్ణయాలు ఏమిటనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామన్నారు. తాను దారిద్య్రంలోనే పెరిగానని, అందుకే తనకు ప్రతి నిరుపేద కష్టం తెలుసునని చెప్పారు. అందువల్లే వారి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేలానే తాను పథకాలు రూపొందిస్తున్నానన్నారు. పేదలకు సాధికారత కల్పించడమే కాకుండా వారికి ఆత్మగౌరవం కూడా కల్పిస్తామని చెప్పారు. ఇటీవల ఎన్‌డిఎలో చేరిన ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు జయంత్‌ చౌదరి కూడా మోడీతో వేదికను పంచుకున్నారు. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌, హర్యానా సిఎం నయీబ్‌ సింగ్‌ సైనీ తదితరులు ర్యాలీలో పాల్గన్నారు.

➡️