కేరళలో 18 స్థానాల్లో యుడిఎఫ్‌

Jun 4,2024 23:49 #kerala, #udf, #win
  • ఒక స్థానంలోఎల్‌డిఎఫ్‌, మరో స్థానంలో ఎన్‌డిఎ గెలుపు

తిరువనంతపురం : కేరళలో గత ఎన్నికల దృశ్యమే పునరావృతమైంది. ఎల్‌డిఎఫ్‌ ఒకే ఒక సీటును గెలుచుకోగా, యుడిఎఫ్‌ 18 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు ఎన్‌డిఎ త్రిస్సూర్‌ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ అల్తూర్‌ నియోజకవర్గంలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి యుడిఎఫ్‌ అభ్యర్ధి, సిట్టింగ్‌ ఎంపి రమ్య హరిదాస్‌ను 19,587 ఓట్ల తేడాతో ఓడించారు. అట్టింగల్‌లో సిపిఎం, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి అదూర్‌ ప్రకాష్‌ 1700ఓట్ల తేడాతో సిపిఎం అభ్యర్ధి వి.జారును ఓడించారు.
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వాయనాడ్‌లో ఘన విజయం సాధించారు. ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి అయిన అనీ రాజా (సిపిఐ)పై 3,64,422 ఓట్ల తేడాతో అపూర్వమైన విజయం అందుకున్నారు. 2019లో రాహుల్‌ గాంధీ మెజారిటీ నాలుగు లక్షల పైమాటే. అలప్పూజలో సిపిఎం సిట్టింగ్‌ ఎంపి ఎ.ఎం.అరిఫ్‌ 63,513 ఓట్ల తేడాతో సీనియర్‌ కాంగ్ర్‌ె నేత కె.సి.వేణుగోపాల్‌పై ఓటమి చవిచూశారు. బిజెపి అభ్యర్ధి, సినీ నటుడు సురేష్‌ గోపి త్రిస్సూర్‌లో 74,686 ఓట్లతేడాతో విజయం సాధించారు. యుడిఎఫ్‌లో ప్రధాన భాగస్వామి అయిన ముస్లిం లీగ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. మలప్పురంలో మహ్మద్‌ బషీర్‌, పొన్నాని నుండి అబ్దుసమద్‌ సమదాని గెలుపొందారు. కాంగ్రెస్‌ నేత, రచయిత శశి థరూర్‌ 16077 ఓట్ల తేడాతో కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌పై గెలిచి తిరువనంతపురం సీటును తిరిగి నిలబెట్టుకోగలిగారు. సిట్టింగ్‌ ఎంపిలు కె.సుధాకరన్‌, రాజ్‌మోహన్‌లు తమ తమ సీట్లను వరుసగా కన్నూర్‌, కాసర్‌గోడ్‌లను తిరిగి నిలబెట్టుకోగలిగారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్‌ పాలక్కాడ్‌లో సిట్టింగ్‌ ఎంపి వి.కె.శ్రీకందన్‌ చేతిలో ఓడిపోయారు. వడకరలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కె.కె.శైలజపై షఫి పరంబిల్‌ గెలుపొందారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ థామస్‌ ఇజాక్‌, ఎలమరమ్‌ కరీం (సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులు) కూడా పతనంతిట్ట, కొజికోడ్‌లో ఓడిపోయారు. కొల్లాం సిట్టింగ్‌ ఎంపి, ఆర్‌ఎస్‌పి నేత ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌, ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి ఎం.ముఖేష్‌ ను లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును పార్టీ ఆమోదించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. యుడిఎఫ్‌ అనుకూల ధోరణి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనబడిందని పేర్కొంది. ఒకప్పుడు సిపిఎంకు అసలు సీట్లు లేవు, 2019లో ఒకే ఒక సీటు వచ్చింది. పార్టీ అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని కార్యదర్శివర్గం పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తాము అటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని, ఆ తర్వాత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ రెండోసారి అధికారాన్ని చేపట్టిందని ఆ ప్రకటన పేర్కొంది.

➡️