గ్రాడ్యుయేట్లలో 13.4 శాతం నిరుద్యోగులు

Dec 18,2023 10:53 #Unemployment rate
unemployed in graduates report

రాష్ట్రంలో 24 శాతం
పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే నివేదిక
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 2022-23లో 13.4 శాతం ఉంది. స్టాటస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ నిర్వహించిన తాజా పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న గ్రాడ్యుయేట్లలో అత్యల్ప నిరుద్యోగిత రేటు చండీగఢ్‌లో 5.6 శాతంగా ఉంది, ఆ తర్వాత ఢిల్లీలో 5.7 శాతం ఉంది. అండమాన్‌ అండ్‌ నికోబార్‌లో అత్యధికంగా నిరుద్యోగం 33 శాతం, లడఖ్‌లో 26.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 24 శాతం ఉన్నట్లు డేటా స్పష్టం చేసింది. పెద్ద రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు రాజస్థాన్‌లో 23.1 శాతం, ఒరిస్సాలో 21.9 శాతంగా ఉంది. మరింత తరచుగా సమయ వ్యవధిలో లేబర్‌ ఫోర్స్‌ డేటా లభ్యతకు సంబంధించిన ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఏప్రిల్‌ 2017లో పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)ని ప్రారంభించింది. జూలై 2022 నుండి జూన్‌ 2023 వరకు ఉంది. ఇంతకుముందు, ఐదు వార్షిక నివేదికలు జులై 2017- జూన్‌ 2018, జూలై 2018- జూన్‌ 2019, జూలై 2019- జూన్‌ 2020, జూలై 2020- జూన్‌ 2021, జూలై 2021- జూన్‌ 2022 మధ్యకాలంలో పిఎల్‌ఎఫ్‌ఎస్‌లో సేకరించిన డేటా ఆధారంగా రూపొందించబడింది. ఇప్పుడు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ జూలై 2022- జూన్‌ 2023 మధ్య కాలంలో నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ఆధారంగా ఆరో వార్షిక నివేదికను విడుదల చేసింది. నమూనాలకు సంబంధించి సమాచార సేకరణ కోసం ఫీల్డ్‌ వర్క్‌ జూలై 2022-జూన్‌ 2023 కాలానికి మధ్య జరిగింది.

➡️