నిరుద్యోగ సమస్యే కీలకం

Apr 13,2024 00:30 #key issue, #Unemployment

– ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం
– ‘సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి’ సర్వేలో వెల్లడి
– గత ఐదేళ్లలో అవినీతి పెరిగిపోయిందన్న 55 శాతం మంది
– లోక్‌సభ ఎన్నికలు మోడీ సర్కారుకు కష్టమే
– రాజకీయ విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని నిరుద్యోగుల నుంచి బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కారు కేంద్రంలో ఏర్పడింది. పదేళ్లు పాలించినా మోడీ మాత్రం ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా దేశంలో ఏటా నిరుద్యోగం తారా స్థాయికి చేరింది. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) వంటి అంతర్జాతీయ నివేదికలూ ఇదే విషయాన్ని వెల్లడించాయి. సిఎస్‌డిఎస్‌ాలోక్‌నీతి నిర్వహించిన సర్వేలోనూ నిరుద్యోగం అనే అంశమే కీలకమని తేలింది. ఈ సమస్యనే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బిజెపిని ఉక్కిరిబిక్కిరి చేయనున్నట్టు తెలుస్తున్నది.
లోక్‌సభ ఎన్నికలకు నిరుద్యోగంతో పాటు ధరల పెరుగుదల, అభివృద్ధి అంశాలు కూడా పని చేయనున్నట్టు ప్రజల అభిప్రాయాలను బట్టి ఈ సర్వే వివరించింది. వీటిలో నిరుద్యోగం, ధరల పెరుగుదల కమలం పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టగలవని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలో నిరుద్యోగం ఏటికేడు తీవ్రమైంది. ఇది భారత్‌లోని గణనీయమైన యువ జనాభాను ప్రభావితం చేస్తుందని ఇటీవల ఐఎల్‌ఒ నివేదిక వివరించిన విషయం విదితమే. 2022లో మొత్తం నిరుద్యోగ జనాభాలో యువత వాటా 82.9 శాతం అని కూడా పేర్కొన్నది. గత ఐదేళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందడం చాలా కష్టంగా మారిందని దాదాపు ఐదింట మూడొంతుల మంది భావిస్తున్నారని అధ్యయనం కనుగొన్నది. కేవలం 12 శాతం మంది ఉద్యోగాలు పొందడం సులభమని చెప్పారు. గ్రామీణ ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉన్నదని వివరించింది.
ఇక దేశంలో అభివృద్ధి విషయంలో మోడీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. ప్రజల్లో ఆ భావన కనిపించటం లేదు. గత ఐదేళ్లలో ‘ధనవంతుల కోసమే’ అభివృద్ధి జరిగిందని 32 శాతం మంది ఓటర్లు భావిస్తున్నారని ప్రీ-పోల్‌ సర్వేలో తేలిందని సర్వే నివేదిక పేర్కొన్నది. కేవలం 8 శాతం మంది మాత్రమే దేశంలో అవినీతిని, అయోధ్యలోని రామ మందిరాన్ని తమ స్వంత ప్రధాన అంశాలుగా చెప్పారని నివేదిక పేర్కొన్నది.
అవినీతి పెరిగిపోయింది
గత ఐదేళ్ల మోడీ పాలనలో అవినీతి పెరిగిపోయిందనే భావన మెజారిటీ ఓటర్లలో కనిపిస్తున్నది. ఈ సర్వేలో 55 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలిపినట్టు అధ్యయనం వివరించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) హామీపై రైతుల నిరసనలు వంటి అంశాలు ఈ సర్వేలో ప్రతిధ్వనించటం గమనార్హం.
మొత్తమ్మీద, రాబోయే లోక్‌సభ ఎన్నికలు బిజెపి ఊహించుకున్నట్టుగా అంత సులువేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిరుద్యోగులు, యువత, మైనారిటీలు, రైతులు, మహిళలు, దళితులు.. ఇలా ప్రతి ఒక్క వర్గమూ మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒక నిశ్శబ్ద విప్లవం కానున్నదని వారు అంచనా వేస్తున్నారు.

➡️