విశ్వాసనీయంగా పనిచేస్తే వంచించారు !

Mar 19,2024 21:17 #Bihar, #resigns, #Union Minister
  • బిజెపి తీరుపై ఆర్‌ఎల్‌జె అధినేత ఆగ్రహం
  • కేంద్ర మంత్రి పదవికి పశుపతి రాజీనామా

న్యూఢిల్లీ : కేంద్రంలోని అధికార బిజెపి నేతృత్వ ఎన్‌డిఎకు బీహార్‌ ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి (ఆర్‌ఎల్‌జె) అధినేత పశుపతి కుమార్‌ పరస్‌ మంగళవారం కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. నిజాయితీగా, విశ్వసనీయంగా ఎన్‌డిఎకు సేవలందిస్తే బిజెపి వంచించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌డిఎ కూటమిలోని తన పార్టీకి బీహర్‌లో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడానికి నిరసనగానే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘నిజాయితీతో, విశ్వసనీయతతో ఎన్‌డిఎలో పని చేశాను. కానీ నా పార్టీకి అన్యాయం జరిగింది’ అని అన్నారు. అంతకుమించి తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఆయన వెల్లడించలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చలు జరిపిన తర్వాత తన రాజకీయ చర్యలపై ప్రణాళిక రూపొందిస్తానని చెప్పారు. రాం విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడైన పశుపతి కుమార్‌ పరస్‌ ఇప్పటివరకు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా వున్నారు. పరస్‌ బీహార్‌లోని హజిపూర్‌ నుండి లోక్‌సభకు పోటీ చేయాలని భావించారు. ఈ విషయంలో రాం విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు, తన మేనల్లుడు చిరాగ్‌ పాశ్వాన్‌తో ఆయన పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీకి హజీపూర్‌తో సహా ఐదు సీట్లను ఎన్‌డిఎ కేటాయించింది. 40 లోక్‌సభ స్థానాలున్న బీహార్‌లో బిజెపి 17, జెడియు 16, ఎల్‌జెపి 5, హెచ్‌ఎఎం 1, ఆర్‌ఎల్‌ఎం 1 స్థానాల్లో పోటీ చేయాలని సోమవారం ఢిల్లీలో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎన్‌డిఎ నిర్ణయించింది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆర్‌ఎల్‌జెని పూర్తిగా విస్మరించింది. ఈ నేపథ్యంలో పశుపతి కుమార్‌ రాజీనామా చేశారు. పరస్‌ ప్రస్తుతం హజీపూర్‌ సిట్టింగ్‌ ఎంపిగా వున్నారు. ఈ స్థానం నుండే రాం విలాస్‌ పాశ్వాన్‌ రికార్డు స్థాయిలో 8సార్లు గెలిచారు. ఈసారి అక్కడ నుండి ఆయన కుమారుడు పోటీ చేయాలని భావిస్తున్నారు.
జెడియు ప్రధానకార్యదర్శి రాజీనామా
ఎన్‌డిఎలో ఈ మధ్యనే తిరిగి చేరిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు చెందిన జనతా దళ్‌ యునైటెడ్‌ (జెడియు)లోనూ అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. జెడియు ప్రధానకార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి మహ్మద్‌ అలీ అఫ్రఫ్‌ ఫత్మీ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైతిక విలువల విషయంలో రాజీ పడలేమని, విలువలను కాపాడుకునేందుకే జెడియుకు రాజీనామా చేశానని తెలిపారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. దర్భంగలో ఆయన ప్రాచుర్యం పొందిన నేత. ఈ స్థానం నంఉచి నాలుగు సార్లు ఆయన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే దర్భంగ, మధుబాని స్థానాలను ఈ దఫా బిజెపికి కేటాయించేందుకు జెడియు అంగీకరించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినుట్ల తెలిసింది. ఈ నేపథ్యంలోనే జెడియుకు గుడ్‌బై చెప్పారు. ఆయన త్వరలోనే ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జెడి)లో చేరే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో దర్భంగ లేదా మధుబాని నుంచి లోక్‌సభకు ఆర్‌జెడి అభ్యర్థిగా బరిలో దిగే వీలున్నట్లు తెలుస్తోంది.

➡️