ఎన్‌డిఎ పై ఐక్య పోరాటం

Dec 19,2023 09:29 #against, #NDA, #United fight
  • ప్రతిపక్ష పార్టీలు కలిసే ఉంటాయి : లాలూ
  • నేడు ఢిల్లీలో ‘ఇండియా’ వేదిక నాలుగో సమావేశం
  • హాజరుకానున్న లాలూ, నితీశ్‌

పాట్నా: ఢిల్లీలో ప్రతిపక్ష వేదిక ‘ఇండియా’ నాలుగో సమావేశం నేడు జరగనున్నది. ఈ సమావేశానికి ముందు అందరి దృష్టి బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై ఉన్నది. ఈ ఇద్దరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఎదుర్కోవటానికి సీట్ల సర్దుబాట్లు, అజెండాను ఖరారు చేయటంలో వీరు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు.

ఈ సమావేశంలో పాల్గొనటానికి వెళ్లే ముందు లాలూ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ వేదిక ఐక్యత, మోడీ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఉంటాయనీ, సమిష్టిగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి ఢిల్లీకి బయలుదేరే ముందు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల కూటమి ఏకమై ఈసారి ప్రధాని మోడీని గద్దె దించేందుకు పోరాడుతుందని చెప్పారు. ప్రతిపక్ష వేదికని ప్రస్తుత రూపంలో పటిష్టం చేయటంలో ముఖ్య పాత్ర పోషించిన ముఖ్యనేతలలో ఒకరిగా లాలూ ఉన్నారు.

బీహార్‌ సీఎం, జెడియు చీఫ్‌గా ఉన్న నితీశ్‌ కుమార్‌ కూడా ‘ఇండియా’ వేదిక సమావేశానికి హాజరుకానున్నారు. లాలూ, నితీశ్‌ ఇద్దరు బిజెపి హిందూత్వ అస్త్రాన్ని (కమండల్‌) ఎదుర్కోవటానికి ‘మండల్‌’ అనే కులగణన అంశాన్ని వాడాలని చూస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. బీహార్‌లోని మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వం కుల సర్వే నివేదికను విడుదల చేయటం, రిజర్వేషన్‌లను పెంచడం వంటి రెండు డిమాండ్‌లను నెరవేర్చిందని వారు చెప్పారు. లాలూ, నితీశ్‌లు ఇద్దరు ‘ఇండియా’ వేదికలో ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో ప్రధాన వాగ్దానంగా ఉపయోగించుకునేలా ఒప్పించగలిగితే ఇది గేమ్‌ ఛేంజర్‌ కావచ్చని వారు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే గట్టిగా వాదన వినిపిస్తున్నారు.

బిజెపిని ఎదుర్కోవటానికి ఐక్య ప్రతిపక్షం (ఇండియా) తప్పనిసరని నితీవ్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్నానని చెప్పారు. కూటమిలో తనకు ఎలాంటి పదవీ అక్కర్లేదని ఆయన ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు.

➡️