బిజెపికి యుపి సవాలే!

Apr 14,2024 23:35 #for BJP!, #UP challenge

గతంలో గెలిచినన్ని సీట్లు అనుమానమే
– ఎస్‌పి, కాంగ్రెస్‌ పొత్తు
– రైతు ఆందోళనల ప్రభావం
– బిజెపి కుల, మత రాజకీయం
జె.జగదీష్‌, ప్రజాశక్తి.
దేశ రాజకీయ చిత్రపటంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అత్యంత కీలకం. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఇక్కడే ఉన్నాయి. దేశంలో కుల, మత రాజకీయాలకు కేంద్ర బిందువుగా యుపి ఉంది. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే.. ఈ రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటే సరిపోతుందనేది రాజకీయ పార్టీల ఆలోచన. అలాంటి రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. ఇక్కడ 17 లోక్‌సభ స్థానాలను ఎస్‌సిలకు కేటాయించారు. మిగిలిన 63 స్థానాలు జనరల్‌ కేటగిరికి చెందినవి.
బిజెపిలో చేరిన మూడు చిన్న పార్టీలు
2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఒబిసి ఓటర్ల ప్రభావం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డి), సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బిఎస్‌పి), జనవాది సోషలిస్ట్‌ పార్టీ (ప్రస్తుతం పేరు జన్‌ జన్‌వాది పార్టీ), అప్నా దళ్‌ (కామెరవాడి), మహాన్‌ దళ్‌లు ఎస్‌పి కూటమిలో ఉన్నాయి. పశ్చిమ జాట్‌లలో ప్రభావం కలిగినజయంత్‌ చౌదరి సారధ్యంలోని ఆర్‌ఎల్‌డి ఇటీవల బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో చేరింది. ఎస్‌బిఎస్‌పి గతేడాది ఎన్‌డిఎలో చేరింది. దివంగత కుర్మీ నాయకుడు సోనేలాల్‌ పటేల్‌ స్థాపించిన అప్నాదళ్‌లో చీలిక సమూహం సంజరు చౌహాన్‌ పార్టీ జన్‌ జన్‌వాది పార్టీ, పల్లవి పటేల్‌, కృష్ణ పటేల్‌ నేతృత్వంలోని అప్నాదళ్‌ (కె) కూడా ఎస్‌పి కూటమి నుంచి విడిపోయాయి. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉన్నాయి. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో బిజెపి 74, అప్నాదళ్‌ 2, ఆర్‌ఎల్‌డి 2, ఎస్‌బిఎస్‌పి 1, నిషాద్‌ పార్టీ 1 (బిజెపి గుర్తుపై) స్థానంలో పోటీ చేస్తున్నాయి.
ఒంటరిగానే కొన్ని చిన్న పార్టీలు
అప్నాదళ్‌ (కె), ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నాయి. అప్నాదళ్‌ మూడు లోక్‌సభ స్థానాలైన ఫుల్‌పూర్‌, మీర్జాపూర్‌, కౌశాంబిలో పోటీ చేయనుంది. జన్‌ జనవాది పార్టీ 30 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ నేతృత్వంలోని ఆజాద్‌ సమాజ్‌ పార్టీ ఒంటిరిగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. మహన్‌ దళ్‌ అధ్యక్షుడు కేశవ్‌ దేవ్‌ మౌర్య, షాక్యులు, సైనీలు, కుష్వాహ్సా, మౌర్యలు వంటి ఒబిసి గ్రూపులలో పార్టీకి పునాది ఉంది. ఎస్‌పి పోటీ చేసే స్థానాల్లో ఆపార్టీకి, కాంగ్రెస్‌ పోటీ చేసే స్థానాల్లో బిఎస్‌పికి మద్దతు ఇచ్చేందుకు ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు బిఎస్‌పి సైతం ఒంటరిగానే పోటీ చేస్తోంది.
ఎస్‌పి, కాంగ్రెస్‌ మధ్య అవగాహన
ఇండియా ఫోరం పార్టీల మధ్య అవగాహన కుదిరింది. సమాజ్‌వాది పార్టీ 63, కాంగ్రెస్‌ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాగా సిపిఐ విడిగా ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రస్తుతం 80 లోక్‌సభ స్థానాల్లో బిజెపికి 64 , ,అప్నాదళ్‌కి 2, బిఎస్‌పికి 8, ఎస్‌పికి 2, కాంగ్రెస్‌ ఒకటి ఉంది. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
కులాల మధ్య చిచ్చుపై బిజెపి
ఉత్తరప్రదేశ్‌లో అన్ని సామాజిక వర్గాలు తమ ప్రభావాన్ని చూపుతాయి. మొత్తం జనాభాలో ఒబిసి 39 శాతం, ఒసి 25 శాతం, ఎస్‌సి 20 శాతం, ముస్లింలు 16 శాతం ఉన్నారు. జాతవ్‌ దళితవర్గం బిఎస్‌పికే అధిక సంఖ్యలో మొగ్గుచూపుతుంది. జాతవ్‌లు, బ్రాహ్మణులకే మాయావతి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. దీంతో జాతవేతర దళితులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్‌సిల్లో పది శాతం ఉన్న జాతవ్‌ యేతర ఖటిక్‌, వాల్మీకి, సోన్‌కార్‌, పాసి, కోరి సహా 60 జాతవేతర దళిత కులాలను బిజెపి ప్రోత్సహించింది. అలాగే ఒబిసిల్లో కూడా 30 శాతమున్న యాదవేతరులు మౌర్యలు, నిషాద్‌, కుర్మీలు, లోధీలను బిజెపి ప్రోత్సహించి లబ్ధి పొందుతోంది. దీంతో ఎస్‌సిల్లో జాతవ్‌ యేతర, ఒబిసిల్లో యాదవేతర కులాల ఓట్లే లక్ష్యంగా బిజెపి పావుల కదిపి, కులాల మధ్య చిచ్చును రగిల్చింది. దీంతో దాదాపు 40 శాతం ఓట్లున్న కులాల మధ్య చీలక తెచ్చి, ఆయా వర్గాల ఓట్లలో గంపగుత్తుగా ఓట్లు రాబట్టుకొని లబ్ధి పొందింది.
అఖిలేష్‌ ‘ పిడిఎ’ ఫార్ములా
2022 అసెంబ్లీ, తరువాత పట్టణ సంస్థల ఎన్నికలలో పరాజయాల నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తూ, అఖిలేష్‌ యాదవ్‌ పిచ్డా, దళిత్‌, అల్పసంఖ్యక్‌ (పిడిఎ…వెనుకబడిన, దళితులు, మైనారిటీలు) కూటమి కొత్త ఫార్ములాను రూపొందించారు. గత ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు ఇప్పటికీ యాదవేతర ఒబిసిలు, జాతవేతర దళితుల ఓట్లలో గణనీయమైన వాటాను పొందాయి. ఈ వర్గాలు బిజెపితో విరక్తి చెందుతున్నారని ఎస్‌పి గ్రహించింది. ఈ వర్గాలలో వ్యవసాయ సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలు దీని వెనుక ఉన్న ప్రధాన శక్తులుగా పరిగణించారు. తదనుగుణంగా ఈ వర్గాలకు చేరువయ్యేందుకు, నేరుగా పార్టీ వ్యూహం సిద్ధం చేసింది.
బిజెపి మత ఎజెండా
కానిస్టేబుల్‌, ఆర్‌ఒ/ఎఆర్‌ఒ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలలో పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా నిరుద్యోగ యువత నిరసన వ్యక్తం చేయడం ప్రస్తుత యుపి ప్రభుత్వం ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. చెరకు రైతుల సమస్యలు ప్రధానంగా యుపి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ధరలు పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలు కూడా బిజెపికి నష్టం చేయనున్నాయి. అయోద్య రామమందిర నిర్మాణం అంశంతో మతమే ఏజెండాగా బిజెపి ఎన్నికల ప్రచారం చేస్తోంది. నిమ్న కులాల్లో సామాజిక, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉండే సాంస్క్రుతిక, జానపద అంశాల్లో బిజెపి మతత్వాన్ని రంగరించింది. దళిత్‌-ఒబిసి కులాలకు చెందిన పలు వర్గాలు హిందూ మత సంప్రదాయాలతో సన్నిహితంగా ఉండటంతోపాటు ఆ ఆచా రాల్లో, సంప్రదాయాల్లో పాలుపంచుకుంటాయి. ఆరెస్సెస్‌, బిజెపిలు ఒక పద్ధతి ప్రకారం వీటిల్లో జోక్యం చేసుకుని మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా వినియోగించుకుంటున్నాయి. గ్రామ దేవతలు, జానపద నాయకులు, గ్రామీణ సంప్రదాయాలు, కళాఖండాలు వగైరాలకు క్రమంగా హిందుత్వ రాజకీయాలలో చొప్పిస్తున్నారు. అంతేకాక గోరక్షణ, రామ మందిరం, హిందూ మహి ళల గౌరవ పరిరక్షణ వంటి సామాజిక పరమైన సున్నిత అంశాలను ముస్లిం వ్యతిరేకతకు బిజెపి వాడుకుం టోంది. కానీ ఈసారి సామాజిక, ఆర్ధిక న్యాయానికి సంబం ధించిన ప్రశ్నలకు బిజెపి సరైన జవాబిచ్చే స్థితిలో లేదు. ఓబీసీల్లోని కింది కులాలు, దళితుల్లోని అట్టడుగు కులాలు మానవాభివృద్ధి సూచీల్లో మెరుగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ కులాలన్నీ ఇప్పటికీ సామాజికంగా వివక్షను, వేధింపులను ఎదుర్కొంటున్నాయి. అత్యంత దారుణమైన పేదరికంలో మగ్గుతు న్నాయి. బిజెపి నినాదం ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’, డబుల్‌ ఇంజిన్‌ సర్కారు, ఈ అట్టడుగు కులాలను దయనీయమైనస్థితి నుంచి బయట పడేయలేకపోయింది. ఇప్ప టికీ ఆ కులాలు అధికారానికి చాలాదూరంలో ఉన్నాయి.
కమలంపై రాజ్‌పుత్‌లు ఆగ్రహం
దశాబ్దాలుగా బిజెపికి మద్దతిస్తూ వస్తున్న రాజ్‌పుత్‌లు ఈసారి ఆ పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యుపి, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఏకంగా బిజెపిని వ్యతిరేకిస్తూ బహిరంగ సభలు, సమావేశాలు, కుల పంచాయతీలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ యుపిలోని సహారన్‌పూర్‌లో ఈనెల 7న రాజ్‌పుత్‌లు మహా పంచాయత్‌ నిర్వహించారు. పశ్చిమ యుపిలో తమ జనాభా దాదాపు 10 శాతం ఉన్నప్పటికీ బిజెపి తమకు కేవలం ఒక్క టిక్కెట్టు (మొరాదాబాద్‌) కేటాయించి అవమానించిందని సదరు పంచాయత్‌లో పలువురు రాజ్‌పుత్‌ నేతలు విరుచుకుపడ్డారు. ఘజియాబాద్‌ నుంచి ఎంపిగా ఉన్న తమ సామాజికవర్గానికి చెందిన జనరల్‌ (రిటైర్డ్‌) వికె సింగ్‌ను బిజెపి ఈసారి పక్కనపెట్టి టికెట్‌ను మరొకరికి కేటాయించటంపైనా రాజ్‌పుత్‌లలో తీవ్ర ఆగ్రహం కలిగించింది. పశ్చిమ యుపిలో బిజెపిపై వ్యతిరేకత రాజ్‌పుత్‌లకే పరిమితం కాలేదు. త్యాగి, సైని వంటి ఇతర అగ్రకులాలు కూడా తమకు చాలా తక్కువగా టికెట్లు కేటాయించటంపై ఆగ్రహంతో ఉన్నాయి. అవి కూడా ఇటీవలి కాలంలో మహా పంచాయత్‌లను నిర్వహించి బిజెపి వ్యతిరేక తీర్మానాలు చేశాయి.

➡️