UP Madarsa Board : అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌ మదర్సాల్లోని 17 లక్షల విద్యార్థులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కలిగించింది. యుపి బోర్డ్‌ ఆఫ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ యాక్ట్‌, 2004ను రద్దు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ తీర్పు 16,000 మదర్సాల్లోని 17 లక్షల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. మ్యాథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ సబ్జెక్టులను కూడా మదర్సాల్లో బోధిస్తున్నారని సూచించింది.

హైకోర్టు నిర్ణయం ప్రాథమికంగా సరికాదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై వివరణనివ్వాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మదర్సా బోర్డ్‌, కేంద్రానికి, యుపి ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై లేవనెత్తిన సమస్యలను మరింత నిశితంగా పరిశీలించాల్సి వుందని సిజెఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

మదర్సా చట్టం 2004 సెక్యులరిజాన్ని ఉల్లంఘిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని గత నెలలో అలహాబాద్‌ హైకోర్టు ప్రకటించింది. మదర్సా విద్యార్థులకు అధికారిక విధ్యా విధానంలో వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మదర్సా బోర్డ్‌ లక్ష్యం, ఉద్దేశం నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆ ఆదేశాలను నిలిపివేసింది.

హైకోర్టు తీర్పుని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సమర్థించాయి. మతం, ఇతర అనుమానిత అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి.

మతపరమైన విద్య అంటే మతానికి సంబంధించిన అంశాల బోధన కాదని మదర్సాల తరపున హాజరైన అభిషేక్‌ మను సింఘ్వీ కోర్టులో వాదించారు. హైకోర్టు ఆదేశాలతో విద్యార్థులతో పాటు 10,000 మంది మదర్సా టీచర్ల భవిష్యత్తు దిక్కుతోచని స్థితిలో పడిందని పేర్కొన్నారు.

➡️