పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

May 26,2024 16:40 #Derailed, #goods..
  • గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : నల్లగొండ జిల్లాలో ఆదివారం గూడ్స్‌ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికుల నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై అధికారులు తెలిపిన వివరాల మేరకు… నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం విష్ణుపురం జంక్షన్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. విష్ణుపురం రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో లూప్‌ లైన్‌ నుంచి మెయిల్‌ లైన్‌కు చేరే క్రాసింగ్‌ వద్ద ఇంజన్‌ నుంచి 4, 5 నెంబర్‌ బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ సంఘటనతో అప్రమత్తమైన లోకో పైలట్‌ రైలును నిలిపివేశారు. గూడ్స్‌ రైలు కావడం, రైలు తక్కువ స్పీడ్‌లో ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన రైల్వే మార్గాన్ని మరమ్మతులు చేపట్టారు. ఈ మార్గంలో ప్రయాణించే సికింద్రాబాద్‌ నుంచి కేరళ వైపు వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో, విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద, మిగిలిన రైళ్లను వేర్వేరు స్టేషన్లలో నిలిపివేశారు. గంటల తరబడి నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు మంచినీరు, ఆహారం కోసం అల్లాడారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు.. ఎండ వేడిమి, ఉక్కపోతతో యాతన పడ్డారు.

మానవత్వం చాటిన ఎమ్మెల్యే బిఎల్‌ఆర్‌
మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్‌ఆర్‌) తమ ఫౌండేషన్‌ సభ్యులతో కలిసి ఆహార పదార్థాలు, వాటర్‌బాటిళ్లు అందజేశారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. రైల్వేమార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించి, ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

➡️