6 రాష్ట్రాల్లోనే 50 శాతం ఉపాధి హామీ ఆడిట్‌

Nov 25,2023 09:50 #kerala, #MGNREGS, #Upadi Hami Padhakam

వంద శాతం పూర్తి చేసిన కేరళ
నిధులు కొరతే ఆడిట్‌ ఆలస్యానికి కారణమంటున్న రాష్ట్రాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్‌) పనుల సామాజిక తనిఖీని పూర్తయింది. 100 శాతం గ్రామ పంచాయతీలను ఆడిట్‌ ను పూర్తి చేసిన ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది. సామాజిక తనిఖీ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయనందున ఆడిట్‌ ఆలస్యం అవుతుందని రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఉపాధి హామీ పథకం అమలులో వచ్చిన ప్రాథమిక ఫిర్యాదులలో అవినీతి కూడా ఒకటి. సామాజిక తనిఖీ అనేది ఈ చట్టంలో అంతర్నిర్మిత అవినీతి నిరోధక యంత్రాంగం. ఈ నెల 10 వరకూ రాష్ట్రాల్లో జరిగిన గ్రామ పంచాయతీల ఆడిట్‌ వివరాలు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన సోషల్‌ ఆడిట్‌లో మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌) నుండి సేకరించబడ్డాయి. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నిర్దేశించిన ఆడిటింగ్‌ ప్రమాణాలు 2016 డిసెంబర్‌ 19న జారీ అయ్యాయి. దీని కింద, ప్రతి సోషల్‌ ఆడిట్‌ యూనిట్‌కు మునుపటి సంవత్సరంలో రాష్ట్రం చేసిన ఉపాధి హామీ వ్యయంలో 0.5 శాతానికి సమానమైన నిధులు కేటాయించాలి. ఆడిట్‌లో ఉపాధి హామీ కింద చేసిన మౌలిక సదుపాయాల నాణ్యత తనిఖీలు, వేతనాలలో ఆర్థిక దుర్వినియోగం, విధానపరమైన లోపాలను తనిఖీ చేయడం వంటివి ఉంటాయి.వివిధ రాష్ట్రాల్లో ఆడిట్‌కేరళ కాకుండా బీహార్‌ (64.4 శాతం), జమ్ముకాశ్మీర్‌ (64.1 శాతం), ఒడిషా (60.42 శాతం), గుజరాత్‌ (58.8 శాతం), ఉత్తరప్రదేశ్‌ (54.97 శాతం) రాష్ట్రాలు 50 శాతం మార్కును దాటాయి. తెలంగాణ (40.5 శాతం), హిమాచల్‌ ప్రదేశ్‌ (45.32 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (49.7 శాతం) మూడు రాష్ట్రాలు మాత్రమే 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీల్లో ఆడిట్‌ పూర్తి చేశారు. తెలంగాణ కాకుండా, ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ (1.73 శాతం), మిజోరం (17.5 శాతం) ఛత్తీస్‌గఢ్‌ (25.06 శాతం), రాజస్థాన్‌ (34.74 శాతం) ఆడిట్‌ చేశాయి.కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో ఆడిట్‌ ఆలస్యంసామాజిక తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించకపోతే, ఉపాధి హామీ కింద నిధులు నిలిపివేయబడతాయని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు రాష్ట్రాలకు గుర్తు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పని చేసే సోషల్‌ ఆడిట్‌ యూనిట్లకు కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆడిట్‌ ఆలస్యమవుతోందని రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి. గ్రామస్థాయి ఆడిటర్లకు జీతాలు ఆలస్యం అవుతున్నాయని పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి.గ్రామ స్థాయిలో సోషల్‌ ఆడిట్‌ : ఎంబి రాజేష్‌దేశం మొత్తంగా కేరళలో మాత్రమే పంచాయితీ స్థాయిలో సోషల్‌ ఆడిట్‌ పబ్లిక్‌ హియరింగ్‌లు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎంబి రాజేష్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాలలో, అటువంటి పబ్లిక్‌ సెక్యూరిటీ డివిజనల్‌ స్థాయిలో మాత్రమే చేయబడుతుందని అన్నారు. ”మేము మా సోషల్‌ ఆడిటింగ్‌ మెకానిజంను పటిష్టంగా చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగా పంచాయితీ స్థాయి పబ్లిక్‌ హియరింగ్‌లను నిర్వహించడంతోపాటు భాగస్వామ్యులందరూ పాల్గొంటారు. ఏది ఏమైనప్పటికీ, కేరళ పాలనలో ప్రజల భాగస్వామ్యం ఆరోగ్యకరమైన సంస్కృతిని కలిగి ఉంది” అని మంత్రి రాజేష్‌ అన్నారు.

➡️