UttarPradesh’s Kaiserganj: బ్రిజ్‌భూషణ్‌ తనయుడికి ఎంపి సీటు

న్యూఢిల్లీ : రెజ్లర్ల ఆందోళనలతో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుండి తప్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ స్థానం నుండి బ్రిజ్‌ భూషణ్‌కు బదులుగా ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ పేరును గురువారం బిజెపి ప్రకటించింది. కరణ్‌ భూషణ్‌ సింగ్‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ బాడీ అధ్యక్షుడిగా ఉన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫోగాట్‌, సాక్షిమాలిక్‌ సహా పలువురు సీనియర్‌ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పటికీ ఢిల్లీ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ పెద్ద కుమారుడు ప్రతీక్‌ భూషణ్‌ సింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. కైసర్‌గంజ్‌ ఎంపి స్థానానికి మే 20న ఐదవ దశలో పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ సమర్పణకు శుక్రవారంతో గడువు ముగియనుంది.

➡️