మణిపూర్‌లో సహాయక శిబిరాల్లోనే ఓటింగ్‌

Apr 9,2024 00:24
  • క్యాంపుల్లో 24,500 మంది

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో కుకీ, మెయితీ రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో అత్యధిక ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సహాయ శిబిరాల్లో ఉన్న సుమారు 24,500 మందికిపైగా ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. శిబిరాల నుంచే వారు ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 24,500 మంది నిర్వాసితులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా గుర్తించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి ప్రదీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. నిరాశ్రయులు, స్థానభ్రంశం చెందిన వ్యక్తుల కోసం 94 ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం మణిపూర్‌ రాష్ట్రంలో మొత్తం 2,955 పోలింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందులో దాదాపు 50 శాతం పోలింగ్‌ స్టేషన్లు చాలా సున్నితమైనవని వెల్లడించారు. కాగా, మణిపూర్‌లో మెయితీ, కుకీ వర్గాల మధ్య సుమారు ఏడాదిగా జరిగిన ఘర్షణలో సుమారు 200 మందికిపైగా మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఆందోళనకారులు వేలాది ఇళ్లకు నిప్పుపెట్టడంతో సుమారు 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇందులో సగానికిపైగా సహాయ శిబిరాల్లో ఇప్పటికీ తలదాచుకుంటున్నారు.

➡️