నదులను అనుసంధానిస్తాం

  • ఎపిలో అవినీతి, పేదరికం పెరిగింది : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, పార్వతీపురం రూరల్‌ : దేశంలోని నదులను అనుసంధానిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాష్ట్రంలో అవినీతి, పేదరికం పెరిగిందని విమర్శించారు. బిజెపి అరకు ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా పార్వతీపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ, విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి వేపగుంట మీనాక్షి కన్వెన్షన్‌ సెంటర్‌లో బిజెపి, టిడిపి, జనసేన కూటమి ఆధ్వర్యాన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో నిర్వహించిన ‘ఎలైట్‌ మీట్‌’లోనూ గురువారం ఆయన ప్రసంగించారు. నదుల అనుసంధానంతో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అవలంభించిన అనాలోచిత విధానాల వల్ల దేశంలో సాగునీటి రంగం అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. నీటి వనరులను సంరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, వర్షం నీటిని భూమిలో ఇంకించేందుకు, సముద్రాల్లో వృథాగా కలిసిపోతున్న వందల క్యూసెక్కుల నీటిని నదుల అనుసంధానం ద్వారా ఒడిసిపట్టేందుకు రాబోయే ఐదేళ్ల కాలంలో కృషి చేస్తామన్నారు. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తిని వ్యవసాయ రంగానికి అనుసంధానించడం ద్వారా రైతుల పంటలకు అధిక విలువ కల్పించే అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ఠ్రంలో జలవనరుల కొరత లేదన్నారు. సరైన ప్రణాళికలు లేకపోవడమే సమస్యని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులను ఆపేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని జలవనరులపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేనందున 1,300 టిఎంసిల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. విశాఖ నుంచి రాయపూర్‌ వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డు జాతీయ రహదారి వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందన్నారు. రాష్ట్రానికి జీవనాడియైన పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాల వల్ల ఆలస్యం చేశారని, ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకూ మేలు చేకూరుతుందన్నారు. వ్యయంతో కూడిన ఇటువంటి పనులన్నీ చేయడానికి కేంద్రంలో బలమైన, స్ధిరమైన ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు.

➡️