ఇజ్రాయిల్‌ ప్రతిపాదనపై స్పందిస్తాం

Apr 28,2024 01:51 #Gaza

హమాస్‌ వెల్లడి
గాజా దాడుల్లో 32మంది మృతి
గాజా : గాజాలో కాల్పుల విరమణపై తాము తాజాగా చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయిల్‌ నుండి ప్రతిస్పందన అందిందని హమాస్‌ తెలిపింది. దీనిపై కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత సమాధానం పంపుతామని పేర్కొంది. ఈ నెల 13న ఈజిప్ట్‌, ఖతార్‌ మధ్యవర్తులు అందచేసిన ప్రతిపాదనలకు ఇజ్రాయిల్‌ అధికారికంగా స్పందించిందని డిప్యూటీ గాజా చీఫ్‌ ఖలీల్‌ అల్‌ హయ్యా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గాజాలో గత ఆరు మాసాలకు పైగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో కాల్పుల విరమణపై జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇజ్రాయిల్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని హమాస్‌ పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో చర్చలు తిరిగి ప్రారంభించేందుకు మార్గాలను అన్వేషించేందుకు శుక్రవారం ఈజిప్ట్‌ ప్రతినిధి బృందం ఇజ్రాయిల్‌ వెళ్ళింది. కాగా ఆ చర్చల అనంతరం ఇజ్రాయిల్‌ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, కొత్తగా తాము ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని చెప్పారు. అయితే తాత్కాలికంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే విషయాన్ని పరిశీలించడానికి సుముఖంగా వున్నామని చెప్పారు. తమ ప్రజల అవసరాలు, హక్కులను పరిగణనలోకి తీసుకుని ఏ ఆలోచనలు లేదా ప్రతిపాదనలైనా పరిశీలిస్తామని హమాస్‌ కూడా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాఫా నగరంపై పదాతిదళం దాడితో ముందుకు సాగేలోగా ఒక అవకాశంగా బందీల విడుదలపై చర్చలకు సిద్ధంగా వున్నామని ఇజ్రాయిల్‌ చెబుతోంది.
32మంది పాలస్తీనియన్లు మృతి,
34,388కి పెరిగిన మరణాలు
గాజాలో శుక్రవారం జరిగిన దాడుల్లో 32మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయిల్‌ అమానుష హత్యాకాండలో ఇప్పటివరకూ మరణించిన పాలస్తీనా వాసుల సంఖ్య 34,388కి పెరిగినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 77,437 మంది తీవ్ర గాయాల పాలైనట్లు పేర్కొంది. సెంట్రల్‌ గాజాలోని నస్రత్‌ శిబిరంలో గల నివాస భవనాలపై దాడుల నేపథ్యంలో ఆ శిధిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు అత్యవసర సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. గాజాలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అక్కడి పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ మాత్రమూ సురక్షితం కాని తాగునీటిని ప్రజలు తాగుతున్నారు. తీవ్రమైన వేడిమిని భరించలేక ఒక చిన్నారి తాజాగా మరణించింది. మరోవైపు అమెరికన్‌ యూనివర్శిటీల్లో కొనసాగుతున్న పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు యూరప్‌ ప్రాంతాలకు కూడా విస్తరించాయి.

➡️