సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఎం పొలిట్‌బ్యూరో

Jan 9,2024 08:36 #Bilkis Bano, #Case, #CPIM, #Supreme Court

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఎం పొలిట్‌బ్యూరో స్వాగతించింది. 2002 గుజరాత్‌ మారణహౌమం సమయంలో అయిదేళ్ల గర్భవతి అయిన బిల్కిస్‌ బానోపైన, ఆమె కుటుంబ సభ్యులపైన సామూహిక అత్యాచారానికి పాల్పడడం, 14మందిని మూకుమ్మడిగా చంపేసిన కేసులో యావజ్జీవ శిక్ష పడిన 11మంది దోషులకు గుజరాత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తూ, శిక్షా కాలాన్ని తగ్గించి ముందస్తుగానే విడుదలజేసింది. వారిని రెండు వారాల్లోగా జైలుకు వెళ్లి లొంగిపోవాలని సుప్రీం కోర్టు తన తాజా తీర్పులో ఆదేశించింది.

శిక్ష తగ్గింపు ఆదేశాలను జారీ చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేయడమే కాకుండా, దోషులతో ప్రభుత్వం కుమ్మక్కైన విషయాన్ని ఎత్తి చూపింది. శిక్ష తగ్గింపు ఆదేశాలను సమర్ధించుకోవడానికి వాస్తవాలను అందజేయడంలో గుజరాత్‌ ప్రభుత్వం మోసానికి పాల్పడిందని ధర్మాసనం పేర్కొంది. నేరస్థులు మోసం చేసి శిక్షను తప్పించుకున్నట్టయితే, సమాజంలో శాంతి, భద్రతలు మిధ్యగా మారిపోతాయని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం ప్రాతిపదికనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లైతే ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా సమ వాటా వున్నట్లేనని సుప్రీం కోర్టు పేర్కొంది. నేరాల క్రూరత్వాన్ని, సమాజంపై వాటి విస్తృత పర్యవసానాలను, చట్టబద్ధ పాలనను వేటినీ పరిగణనలోకి తీసుకోకుండా శిక్షను మార్చారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రభుత్వాలనేవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ప్రభుత్వాలు తమ అధికార పరిధులను, చట్టాన్ని, న్యాయ వ్యవస్థను ఉల్లంఘించేలా వ్యవహరించినట్లైతే, అది మన ప్రజాస్వామ్య ఉనికినే ప్రమాదంలో పడేస్తుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

ఐద్వా హర్షం

దోషులను ముందుగానే విడుదల చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీం వెలువరించిన తీర్పు పట్ల ఐద్వా హర్షం వ్యక్తం చేసింది. జైలు శిక్ష పూర్తి కాకుండానే 14 ఏళ్లకే దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ఐద్వా ఆనాడే వ్యతిరేకించిందని పేర్కొంది. ఈ కేసులో విచారణ, శిక్ష అన్నీ మహారాష్ట్రలో జరిగాయి కాబట్టి శిక్ష తగ్గించే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని కోర్టు పేర్కొందని ఐద్వా గుర్తు చేసింది. దోషి రాధేశ్యామ్‌ భౌతిక ఆధారాలను తొక్కిపట్టి సుప్రీం కోర్టును మోసగించారని, తద్వారా 2022 మేలో సానుకూలమైన ఆదేశాలు పొందారని, అవి, 11మంది దోషులను విడుదల చేయడానికి దారి తీశాయని కోర్టు పేర్కొంది. గుజరాత్‌ ప్రభుత్వం 2022 మేలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయలేదని, అందుకు బదులుగా దోషులతో కుమ్మక్కైందని ఐద్వా పేర్కొంది.

ఐద్వా రాష్ట్ర కమిటీ హర్షం

బిల్కిస్‌బానో కేసులో దోషులు తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తీర్పును ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి స్వాగతించారు. సుప్రీం తీర్పు బిజెపికి చెంపపెట్టని, వెంటనే దోషులను జైలుకు పంపాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించింది : బృందా కరత్‌

బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నిలిపాయని సిపిఎం నేత బృందాకరత్‌ పేర్కొన్నారు.

న్యాయానికి దక్కిన విజయం :రాహుల్‌ గాంధీ , కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు

బిజెపి ప్రభుత్వ దురహంకారానికి వ్యతిరేకంగా బిల్కిస్‌ బానో అవిశ్రాంతంగా జరిపిన పోరాటానికి దక్కిన విజయమిది ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేరస్తులను పెంచి పోషిస్తోంది ఎవరనే విషయం దేశానికి చాటి చెప్పినట్లైంది.

బిజెపికి చెంప పెట్టు :మమత బెనర్జీ , తృణమూల్‌ అధినేత

బిజెపికి చెంప పెట్టులాంటి తీర్పు ఇది. ఈ సాహసోపేతమైన తీర్పును స్వాగతిస్తున్నాం.

బిజెపి మహిళా సాధికారత డొల్లతనం బయటపడింది :అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంఐఎం నేత

మహిళా సాధికారిత గురించి బిజెపి చెప్పే మాటల్లోని దొల్లతనాన్ని ఈ తీర్పు బయటపెట్టింది. బిల్కిస్‌ బిల్కిస్‌ బానోకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాపణ చెప్పాలి.

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : ఫరూక్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు

గుజరాత్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఇది నిలువెత్తు నిదర్శనం

➡️