వెయిట్‌ అండ్‌ సీ 

Jun 3,2024 15:31 #exit polls, #Sonia Gandhi
  •  కాంగ్రెస్‌ చాలా ఆశాభావంతో ఉన్నది : సోనియా గాంధీ

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై సోనియా గాంధీ తన మొదటి స్పందనను తెలియజేశారు. ఈ విషయంలో వేచి చూడాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్‌ పోల్స్‌లో చూపిన దానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ చాలా ఆశాభావంతో ఉన్నదని చెప్పారు. మంగళవారం ప్రకటించబోయే ఎన్నికల ఫలితాలపై ఆమె అంచనాల గురించి అడిగినప్పుడు సోనియాగాంధీ పైవిధంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే భారీ మెజారిటీతో గెలుస్తుందనీ, ప్రధాని మోడీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారని చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన విషయం విదితమే.
కాంగ్రెస్‌, ఇతర ఇండియా బ్లాక్‌ పార్టీలు ఎగ్జిట్‌ పోల్స్‌ను తిరస్కరించాయి. ఈ సర్వేలు ”కల్పితం” అని పేర్కొంటూ ప్రతిపక్ష ఇండియా వేదిక తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. ” దీనిని ఎగ్జిట్‌ పోల్‌ అని పిలవరు. దాని పేరు ‘మోడీ మీడియా పోల్‌’ ” అని రాహుల్‌ గాంధీ ఇప్పటికే అభివర్ణించారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ప్రసిద్ధ పాటను ప్రస్తావిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 100వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొని మాట్లాడారు. ”కళైంజర్‌ కరుణానిధి 100వ జయంతి సందర్భంగా డిఎంకెకు చెందిన నా సహచరులతో కలిసి ఇక్కడకు రావటం ఆనందంగా ఉన్నది. ఆయనను చాలా సందర్భాలలో కలుసుకునే అదృష్టం కలిగింది. ఆయన చెప్పేది వింటూ.. ఆయన వివేకం, సలహాల నుంచి ప్రయోజనం పొందాను. ఆయనను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని సోనియా అన్నారు.

➡️