Manipur:గౌరవంగా జీవించే హక్కు కల్పించలేనపుడు.. మా ఓటు హక్కుకి భరోసా ఏమిటీ?

ఇంఫాల్‌ :  గౌరవంగా జీవించే  హక్కును ప్రభుత్వం కల్పించలేనపుడు,  మా ఓటు హక్కు కి భరోసా ఎలా ఇస్తారని 42 ఏళ్ల నోబి ప్రశ్నించారు. మాది కాని ప్రదేశానికి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి మేము ఎందుకు ఓటు వేయాలని నిలదీస్తున్నారు.  ఎన్నికల వలన మాకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. జాతి ఘర్షణల పేరుతో మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండలో నోబి 11 నెలల క్రితం తన తల్లిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన మణిపూర్‌లోని సహాయక శిబిరంలో తలదాచుకుంటున్నారు. నోబి ఒక్కరే కాదు అక్కడ సహాయక కేంద్రాల్లో ఉన్న నిరాశ్రయలందరిదీ ఇదే మాట. ”ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ముందు జీవించే హక్కు ఉండాలి”, ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాకళ్ల ముందే మా ఇంటిని దుండగులు తగులబెట్టారు. అర్థరాత్రి మా కుటుంబం ప్రాణాల కోసం పరుగులు తీశాం. మా ఇల్లు ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఏమి మిగిలి ఉందో కూడా తెలియదు. ఇక నాది కాని ప్రదేశానికి నేను ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఎందుకు ఓటు వేయాలి. ఎన్నికలు అంటే మాకు ఏదీ కాదు.. అదంతా జిమ్మిక్కు అని అన్నారు.

ఇటీవల పాఠశాల విద్యను పూర్తి చేసిన దిమా (18) తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో చదువును కొనసాగించడానికి ఎలా ప్లాన్‌ చేసుకోగలను. నా మొదటి ఓటును ఎందుకు వృధా చేయాలని, ఇటువంటి పరిస్థితుల్లో తాను ఓటు వేయలేనని అన్నారు. ఇంఫాల్‌లోని ప్రభుత్వ నృత్య కళాశాల ఆడిటోరియలంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలో దిమా ఆశ్రయం పొందింది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ప్రారంభించిన పిల్లలకు బోధిస్తూ రోజంతా గడుపుతోంది.

గతంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు మాకోసం ఏమి చేస్తున్నారని కంభా ప్రశ్నించారు. సహాయక శిబిరాల్లో పడేశారని, ఇకపై తమ భవిష్యత్తు ఏమిటని నిలదీస్తున్నారు. ఆయన కుకీ ఆధిపత్యం కలిగిన మోరె పట్టణంలో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తమ నివాసం, వాహనాలు దగ్థమయ్యాయని, ఇప్పుడు ఓటు వేసి ఏంచేయాలని ప్రశ్నించారు.

గతేడాది మే 3 నుండి మెజారిటీ మొయితీలు, కుకీల మధ్య ఘర్షణ పేరుతో చెలరేగిన హింసాకాండలో సుమారు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది కుకీలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు సద్దుమణగలేదు. దీంతో చాలా మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సహాయక శిబిరాల్లో ఓటింగ్‌ నిర్వహించాలనే ఆలోచన కేవలం ఓ జిమ్మిక్కు మాత్రమేనని, అసలు సమస్యలు పరిష్కరించలేదని బాధిత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంఫాల్‌ లోయలోని నాలుగు సహాయ శిబిరాలను పిటిఐ సందర్శించింది. అక్కడి ప్రజలు ఎన్నికల ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది.

రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
మణిపూర్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్‌ 19, 26 తేదీల్లో జరగనున్నాయి. ఇన్నర్‌ మణిపూర్‌, ఔటర్‌ మణిపూర్‌లోని కొన్ని సెగ్మెంట్‌లు ఏప్రిల్‌ 19న మొదటి దశలో ఓటు వేయనుండగా, ఔటర్‌ మణిపూర్‌లోని మిగిలిన సెగ్మెంట్‌లు ఏప్రిల్‌ 26న రెండో దశలో ఓటు వేయనున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. సుమారు 50,000 మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఉంటున్నారు.

2019లో అత్యధిక పోలింగ్‌
2019 ఎన్నికల్లో 82 శాతానికి పైగా పోలింగ్‌తో మణిపూర్‌ రికార్డు నెలకొల్పింది. అత్యధిక శాతం మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఇటీవల హింసాకాండ ఎన్నికలపై నీలినీడలు కమ్మేశాయి.ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడమేమిటని ప్రజా సంఘాలు, బాధిత ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కనిపించని రాజకీయ నేతలు..  ప్రచారం ఊసే లేదు.. 

ఎలక్షన్‌ కమిషన్‌ అధికారుల సమాచారం ప్రకారం.. సహాయక శిబిరాల్లో నివసిస్తున్న 24,000 మందికి పైగా ప్రజలు ఓటు వేయడానికి అర్హులుగా గుర్తించబడ్డారు. వారి కోసం 94 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే రాజకీయ పార్టీల పోస్టర్లు కానీ ర్యాలీలు కానీ ఈ ప్రాంతంలో కనిపించడం లేదు. పౌరులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతూ స్థానిక ఎన్నికల అధికారులు ఏర్పాటు ఏసిన హోర్డింగ్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఓట్ల ప్రచారం కోసం, ఎన్నికల హామీలు గుప్పించేందుకు రాజకీయ నేతలు ఈ ప్రాంతంవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని పిటిఐ విచారణలో వెల్లడైంది.

➡️