మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్దరించడానికి ఎంవిఎ, ఇండియా పోరమ్‌లను గెలిపించండి

తుషార్‌గాంధీ, జావేద్‌ ఆనంద్‌, తీస్తా సెతల్వాద్‌, స్వరా భాస్కర్‌సహా ప్రముఖుల బహిరంగ లేఖ
ముంబయి : మసకబారిన మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్ధరించడానికి మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ), ఇండియా వేదికను గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు 33 మంది ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ఏక్‌నాథ్‌ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌ అధికార దాహంతో ఉన్న అవకాశవాదులుగా విమర్శించారు. అధికారం కోసం వీరు ఎవరైనైనా విడిచిపెట్టగలరని, ఎవరితోనైనా కలవగలరని పేర్కొన్నారు. ‘ఒకప్పుడు, మహారాష్ట్ర ప్రగతిశీల విలువల ఆధారిత రాజకీయాలకు చిహ్నంగా నిలిచింది, దేశంలోనే ముందుగా ఆలోచించే రాష్ట్రంగా ఉండేది. తుకారామ్‌, శివాజీ, జ్యోతిబాఫూలే, అంబేద్కర్‌ తదితర ప్రముఖుల వారసత్వం, త్యాగాలు గర్వకారణం. అందువల్లే మహారాష్ట్ర సామాజిక-రాజకీయాలు, ఆర్థిక. సాంస్కృతిక రంగంల్లో ఒక జాతీయ ప్రమాణంగా, ఒక వెలుగురేఖగా తన హోదాను కొనసాగించింది’ అని గుర్తు చేశారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు పార్టీల కారణంగా మహారాష్ట్ర ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. అధికారంలో ఉన్న కూటమి అనైతిక కూటమి మాత్రమే కాదని, మోడీ, అమిత్‌ షాల కీలుబమ్మ కూటమి అని పేర్కొన్నారు. బెదిరింపులు, ప్రలోభాలు కారణంగా రాష్ట్రంలో రెండు పార్టీలు (శివసేన, ఎన్‌సిపి) విచ్ఛినమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడటం సహజమని, ఈ పోటీ రాజ్యాంగం, ప్రజాస్వామం నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మనస్సాక్షిని పాటిస్తూ, బాధ్యతగా ఓటువేయాలని కోరారు. తాము ఏ రాజకీయ పార్టీకి చెందని వారమని, ప్రజాస్వామ్య నిబంధనలను గట్టిగా సమర్థిస్తున్నామని లేఖపై సంతకం చేసిన వారు తెలిపారు. సంతకం చేసిన వారిలో జిజి పరిఖ్‌, రావుసాహెబ్‌ కసాబ్‌, తుషార్‌ గాంధీ, రామ్‌ పునియాని, శ్యామ్‌దాదా గైక్వాడ్‌, తీస్తా సెతల్వాద్‌, ఉత్తమ్‌ కాంబ్లే, బిజి కోల్సే పాటిల్‌, సురేష్‌ ఖోప్డే, మేఘా పన్సారే, ఆనంద్‌ పట్వర్ధన్‌, జావేద్‌ ఆనంద్‌, ఇర్ఫాన్‌ ఇంజనీర్‌, డాల్ఫీ డిసౌజా, ఎంఎ ఖలీద్‌, నిరంజన్‌ తక్లే, శంభాజీ భగత్‌, డాక్టర్‌ సురేష్‌ ఖైర్నర్‌, జ్ఞానేష్‌ మహారావ్‌, అన్వర్‌ రాజన్‌, నందకుమార్‌ పాటిల్‌, ఉల్కా మహాజన్‌, అసిమ్‌ సరోదే, సంజరు ఎంజి, వర్ష్‌ దేశ్‌పాండే, డాక్టర్‌ సలీం ఖాన్‌, నూరుద్దీన్‌ నాయక్‌, సయీద్‌ ఖాన్‌, స్వరా భాస్కర్‌, ఫిరోజ్‌ మితిబోర్వాలా, శరద్‌ కదమ్‌, విశాల్‌ హివాలే, గుడ్డి ఎస్‌ఎల్‌ ఉన్నారు.

➡️