పారాసిటమాల్‌, వ్యాక్సిన్లతో సహా 800కి పైగా మందుల ధరలకు రెక్కలు

Apr 2,2024 00:20 #Medicines, #prices of over 800

న్యూఢిల్లీ: పారాసిటమాల్‌ మాత్రలు,, రోగ నిరోధక టీకాలతో సహా 800 కిపైగా నిత్యావసర మందుల ధరలకు రెక్కలొచ్చాయి. వీటి ధరలు ఒకేసారి 10 శాతానికిపైగా పెంచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంత పెద్దయెత్తున మందుల ధరలు పెంపునకు అనుమతించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. 2022లో 12 శాతం పెంపుదలకు అనుమతించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ఏడాది మరో 10.7 శాతం ధర పెంచేందుకు అనుమతించింది. ఈ పెంపుదల ఏప్రిల్‌ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇకపై మందుల ధరలను నిర్ణయించే అధికారం కంపెనీలకే ప్రభుత్వం అప్పగించింది. గత నెల 27న విడుదలజేసిన నోటిఫికేషన్‌ ప్రకారం, ఔషధ తయారీదారులు టోకు ధరల సూచిక ఆధారంగా ఎంఆర్‌పి ధర పెంచవచ్చు. అటువంటి పెంపుదలకు ప్రభుత్వం నుండి ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదు.పారాసిటమాల్‌, అజిత్రోమైసిన్‌ వంటి నిత్యావసర ఔషధాల ధరలను పెంచడం వల్ల ఇవి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీబయాటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్షన్‌ డ్రగ్స్‌ వంటి వాటి ధరలు ఏప్రిల్‌ నుంచి పెరగనున్నాయని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ (ఎన్‌ఎల్‌ఈఎం)లో మందుల ధరలను కూడా నిర్ణయించే అధికారం కంపెనీలు లాక్కునే పరిస్థితి.945 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు రాజకీయ పార్టీల కోసం కొనుగోలు చేశాయి. 1997లో ఏర్పాటైన నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ మందుల ధర నియంత్రణ, నాణ్యతకు బాధ్యత వహిస్తుంది.

➡️