నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే

Mar 7,2024 08:38 #leaders, #Report, #Women

 కుటుంబ బాధ్యతలే ప్రధాన కారణం

న్యూఢిల్లీ : ‘ఫార్ట్యూన్‌ 500 ఇండియా లిస్ట్‌’లోని కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలకు మాత్రమే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. తదుపరి ఐదు వందల కంపెనీల జాబితాలో 5% సంస్థలను మహిళలు నిర్వహిస్తున్నారు. భారతీయ కంపెనీల్లో మహిళల నాయకత్వాన్ని పెంచే విషయంపై నిర్వహించిన అధ్యయనంలో భాగంగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఈ అధ్యయనాన్ని ఫార్ట్యూన్‌ ఇండియా, ఎస్‌పీ జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ సంయుక్తంగా నిర్వహించాయి. దీనికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహాయ సహకారాలు అందించాయి.

ఈ అధ్యయనం ప్రకారం 30-40 శాతం మంది మహిళా ఉద్యోగులు మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ (ఏదైనా సంస్థలో సీనియర్‌, జూనియర్‌ మేనేజర్ల మధ్యలో ఉన్న మేనేజర్ల స్థాయి)లో ప్రవేశించే సమయంలోనే ఉద్యోగాలు వదిలేస్తున్నారు. ఆ సమయంలో వారికి వివాహం కావడం, ఓ కుటుంబం ఏర్పడడమే దీనికి కారణం. మెటర్నిటీ సెలవు తీసుకొని, పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం వారికి సవాలుగా మారుతోంది.

మిడిల్‌ మేనేజ్‌మెంట్‌లో మహిళలను ఉద్యోగులుగా తీసుకునేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. వారు తప్పనిసరిగా ఆరు నెలల పాటు మెటర్నిటీ సెలవులో ఉంటారని, దీంతో విధులకు అంతరాయం కలుగుతుందని అవి భావిస్తున్నాయి. పైగా సెలవు కాలంలో జీతం చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న కంపెనీలు అంత ఆర్థిక భారాన్ని మోయలేవు. మిడిల్‌ మేనేజ్‌మెంట్‌లో మహిళలను నియమించుకోవడానికి కంపెనీలు ఇష్టపడకపోవడానికి మరో కారణం కూడా ఉంది. పిల్లలు బోర్డు పరీక్షలు రాసేటప్పుడు తల్లులు విధిగా సెలవు పెడతారు. పైగా 40 ఏళ్ల వయసున్న మహిళలు తల్లిదండ్రులు లేదా అత్తమామల బాగోగులు చూసుకోవాల్సి వస్తుంది. ఈ కారణాలన్నింటి వల్ల కంపెనీలలో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మహిళలు ముందుకు రావడం లేదు.

  • సర్వే సూచనలు

ఇవేలిస్టెడ్‌ కంపెనీల బోర్డుల్లో మహిళల సంఖ్యను 8 శాతం నుంచి 17 శాతానికి పెంచారు. అయితే వీరిలో కొద్ది మందికి మాత్రమే డిమాండ్‌ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నాయకత్వ స్థాయికి మరింత మంది మహిళలు రావాల్సిన అవసరం ఉన్నదని సర్వే అభిప్రాయపడింది. లింగ వైవిధ్యాన్ని పెంచేందుకు కృషి చేసే కంపెనీలకు కార్పొరేట్‌ పన్నులు తగ్గించాలని, మహిళలకు ఆదాయపన్ను మినహాయింపులు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. పనిగంటల విషయంలో మహిళలకు వెసులుబాటు కల్పించాలని, రాత్రి సమయంలో పనిచేసే మహిళల పట్ల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, నివాసాల సమీపంలో ఉండే క్రచ్‌లు, వృద్ధుల బాగోగులు చూసే కేంద్రాలను ఉపయోగించుకునేందుకు మహిళలకు అవకాశం కల్పించాలని కూడా సర్వే సూచించింది.

➡️