అంబరాన్నంటిన పిల్లల సంబరాలు

Dec 25,2023 08:45 #balostavalu, #guntur

– ముగిసిన హేలాపురి, పల్నాడు బాలోత్సవాలు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా/ ఏలూరు అర్బన్‌ :బాలల్లో ఆటపాటలు యాంత్రికంగా తయారైన నేపథ్యంలో వారిలో సహజత్వాన్ని పెంచాలని, సృజనాత్మకతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బాలోత్సవాలు జరిగాయి. ఏలూరు అమీనాపేటలోని సురేంద్ర బహుగుణ స్కూల్లో షేక్‌ సాబ్జీ స్మారక ప్రాంగణంలో జరుగుతున్న హేలాపురి బాలోత్సవం-4 రెండో రోజు ఆదివారం ఉత్తేజభరితంగా సాగింది. పిల్లల సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ.. బాలోత్సవంలో అభ్యుదయ సాహిత్యం ప్రాతిపదికన జానపద, ప్రాచీన కళల ఆధారంగా నృత్యాలతో పిల్లల సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రాచీన, జానపద కళలు, సాహిత్యమే నేటి సినీ సాహిత్యానికి మూలాధారమని తెలిపారు. బాలోత్సవ కార్యక్రమాల నిర్వహణ ద్వారా సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలలో పిల్లలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడం ద్వారా వారిలో మరింత ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ భార్య డాక్టర్‌ మానస, తపన ఫౌండేషన్‌ చైర్మన్‌ గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఆయన సతీమణి రేణుక, నాగహనుమాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ టి.భాస్కర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్‌, బాలోత్సవం ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, అమరావతి బాలోత్సవం నిర్వాహకులు రామరాజు, కాకినాడ క్రియా బాలోత్సవం నిర్వాహకులు జగన్నాధరావు, జంగారెడ్డిగూడెం బాలోత్సవం నిర్వాహకులు సూర్యారావు, దేవరపల్లి బాలోత్సవం నిర్వాహకులు ఉండవల్లి కృష్ణారావు, హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం నాయకులు మారుబోయిన కోటేశ్వరరావు, పాల్గోన్నారు.పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పాలడుగు నాగయ్య చౌదరి కొత్త రఘురామయ్య కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పల్నాడు బాలోత్సవం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పల్నాడు జిల్లా విజ్ఞాన కేంద్రం చైర్మన్‌ గుంటూరు విజరుకుమార్‌ మాట్లాడుతూ చిన్నారులు సహజంగా ఎదగడానికి బాలోత్సవాలు దోహదం చేస్తాయని వివరించారు. బాలోత్సవంలో లఘు నాటికలు, జానపద నృత్యం, పాటలు, ప్రాజెక్ట్‌ వర్క్‌, రంగవల్లులు, కోలాటం, విచిత్ర వేషధారణ, వక్తృత్వం, కథలు చెప్పడం, బుర్రకథ, మట్టితో బమ్మల తయారీ, పేపర్‌ క్రాఫ్ట్స్‌ పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జానపద నృత్యం, కోలాటం ప్రదర్శనకు విశేష స్పదన లభించింది. గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు విద్యార్థులు తమ ఆటపాటల్లో చూపారు. దేశభక్తి, కుటుంబ బాధ్యవ్యాల విలువ, అభ్యుదయం తదితర గేయాలు ఆకట్టుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలోత్సవ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, కార్యదర్శి కట్ట కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి, కోశాధికారి కోయా రామారావు, విజ్ఞాన కేంద్రం కమిటీ కన్వీనర్‌, గద్దె చలమయ్య, సభ్యులు కామినేని రామారావు పాల్గొన్నారు.

➡️