అరుణోదయ నగర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి-న్యూ రాజరాజేశ్వరి పేటలో నిరసన దీక్ష 

Mar 4,2024 07:58 #cpm, #nirasana

ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ రాజరాజేశ్వరి పేట అరుణోదయ నగర్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేయాలని బుడమేరు రైలు బ్రిడ్జి కింద రోడ్లు నిర్మించి లైట్లు వేయించాలని స్థానికులు ఆదివారం నిరసన దీక్షకు దిగారు. రాజరాజేశ్వరి పేటలో చేపట్టిన ఈ దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మద్దతు తెలిపి మాట్లాడారు. డిస్నీలాండ్‌ స్థలంలోని ఇల్లు లేని పేదలకు వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రకారం ఎన్నికల ముందే ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరారు. డిస్నీలాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటు నిలిపివేయలని, న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇళ్లపై నుండి వెళ్తున్న కరెంటు తీగలను ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్చాలని డిమాండ్‌ చేశారు. అయోధ్యనగర్‌ వైపు రైల్వేలైన్‌ కింద నుండి వెళ్లే రోడ్ల ఇరువైపుల లైట్లు వేయాలని, అపార్ట్‌మెట్‌ వాసులకు బ్యాంక్‌ అప్పులు ఇచ్చేలా పక్కా రిజిస్ట్రేషన్‌ పత్రాలివ్వాల కోరారు. 23 ఏళ్ల గడిచిన ఇళ్లకు మాత్రం రిజిస్ట్రేషన్‌ కాలేదని, తాము గెలిస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని గత ఎన్నికల ముందు వైసిపి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కార్పొరేషన్లో కమ్యూనిస్టుల హయాంలో తాను కార్పొరేటర్‌గా ఉన్న కాలంలో ఒక్క రూపాయి నుంచి రూ.15ల లోపు నామమాత్రం ధరలకే సింగ్‌నగర్‌, పాయకాపురం, రాజీవ్‌ నగర్‌, కండ్రిగ ప్రాంతాల్లో 40 వేల మందికి పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించామని తెలిపారు. అరుణోదయ నగర్‌ వాసులను వైసిపి, టిడిపిలకు చెందిన ప్రజాప్రతినిధులు మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్‌, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి రమణరావు, సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు, టి శ్రీనివాస్‌ సాయి, సిఐటియు నాయకులు రాము, కె దుర్గారావు పాల్గొన్నారు.

➡️