ఆక్రమిత అటవీ భూములను పేదలకివ్వండి : సిపిఎం

Dec 8,2023 08:27 #cpm, #Dharna

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, పెనకచర్ల డ్యాం గ్రామాల పరిధిలోని అటవీ శాఖ భూములను కొందరు ఆక్రమించారని, వారి నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సిపిఎం ఆధ్వర్యంలో పేద రైతులతో కలిసి అనంతపురం అటవీశాఖ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, జిల్లా కమిటీ నాయకులు తరిమెల నాగరాజు, ఎం.కృష్ణమూర్తి మాట్లాడారు. గార్లదిన్నె మండలంలో అటవీ శాఖకు సంబంధించిన 800 ఎకరాల భూస్వాములను కొందరు భూస్వాములు ఆక్రమించారని, తక్షణమే ఆ భూములను స్వాధీనం చేసుకుని గార్లదిన్నె, పెనకచర్ల డ్యాం, ముకుందాపురం, ఇల్లూరు గ్రామంలోని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పేద రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, పండ్లతోటల రైతుసంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, సిపిఎం గార్లదిన్నె మండల కార్యదర్శి సి.చెన్నారెడ్డి, మండల సహాయ కార్యదర్శులు ఎం.నల్లప్ప, ఎం.డిరాముడు, దళిత, గిరిజన, బిసి రైతులు, కూలీలు పాల్గొన్నారు.

➡️