ఆర్‌టిసి బస్సును ఢీకొన్న అంబులెన్స్‌

  • ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
  • మృతదేహాన్ని తీసుకువస్తుండగా ప్రమాదం

ప్రజాశక్తి – తాడిపత్రి రూరల్‌, చెన్నేకొత్తపల్లి : శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో మరణించిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకు వస్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు..తాడిపత్రి పట్టణం నందలపాడుకు చెందిన షెక్షావలి (47) అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని తాడిపత్రికి షెక్షావలి భార్య షేక్‌ షకీలా (42), అల్లుడు షేక్‌ గౌస్‌ (33) బయలు దేరారు. చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గేట్‌ 44వ జాతీయ రహదారిపై అనంతపురం వైపు వెళ్తుండగా ముందు వెళ్తున్న ఆర్‌టిసి బస్సును వేగంగా అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షకీలా, షేక్‌గౌస్‌ అక్కడికక్కడే మరణించారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ సురేష్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️