ఆహార, పోషక భద్రత రైతులతోనే సాధ్యం

Dec 20,2023 09:23 #anakapalli, #kisan mela

– ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ప్రశాంతి

ప్రజాశక్తి – అనకాపల్లి :దేశంలోని ప్రజలకు ఆహార, పోషక భద్రత రైతుల పంటలతోనే సాధ్యమని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి అన్నారు. అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జరిగిన 64వ కిసాన్‌ మేళా సభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వ్యవసాయం పట్ల ఎప్పటికప్పుడు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. 2050 నాటికి దేశ జనాభా భారీగా పెరగనుందని, వారందరికీ ఆహారం అందాలంటే రైతులకు కావాల్సిన సాంకేతికతను అందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందన్నారు. అందుకోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందాల్సి ఉందని పేర్కొన్నారు. పంచదార, వరి, కూరగాయలు వంటి ఎగుమతుల ద్వారా దేశానికి మంచి ఆదాయం చేకూరుతోందని తెలిపారు. రసాయనిక, యాంత్రీకరణ విధానాలతో రైతులు ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవచ్చని సూచించారు. జడ్‌ఆర్‌ఎఎస్‌, కిసాన్‌ మేళా, శిక్షణ సందర్శన వంటి కార్యక్రమాల్లో రైతుల సమస్యలను గుర్తించి వారికి కావలసిన అంశాల పట్ల పరిశోధనలు జరగాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ బోర్డు సభ్యులు సాయిలక్ష్మి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్‌ పివికె.జగన్నాథరావు, వైసిపి అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్‌ పాల్గన్నారు. తొలుత వ్యవసాయంపై ఆర్‌ఎఆర్‌ఎస్‌ ముద్రించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.

➡️