ఇండియా వేదికను గెలిపించండి – ఆవాజ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు

Mar 23,2024 20:37 #aawaz committee

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్రంలో బిజెపితో ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటకాగే పార్టీలను ఓడించి, ఇండియా వేదికలోని లౌకిక పార్టీలను, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని ఆవాజ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎ సుభాన్‌, ఎంఎ చిస్టి పిలుపునిచ్చారు. లౌకికవాద పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా బిజెపిని ఓడించాలని శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వారు కోరారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ మైనార్టీల పథకాలకు కోత వేశారని, వివిధ పథకాలను నిలిపివేశారని విమర్శించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం అంటూ ముస్లిముల ఉనికినే ప్రమాదంలోకి నెట్టే సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలను బిజెపి తీసుకొచ్చిందని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను అణచివేసేవిధంగా బిజెపి నిరంకుశ పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని టిడిపి, వైసిపిలు.. బిజెపి ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ సమర్థించాయని, దేశంలో దళితులు, మైనార్టీలపై దాడులు జరిగితే ఖండించలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటంలో ఈ రెండు పార్టీలు విఫలం చెందాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుని, ప్రజల హక్కులను సంరక్షించుకునేందుకు అటు దేశంలో బిజెపి కూటమిని, ఇటు రాష్ట్రంలో టిడిపి, వైసిపి, బిజెపి, జనసేన పార్టీలను ఓడించాలని, ఇండియా వేదికలోని పార్టీలను, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

➡️