ఉక్కు అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడి

Dec 26,2023 22:23 #Dharna, #Steel plant workers

– స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే దారులన్నీ దిగ్బంధం

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ ఉక్కును ప్రయివేటుపరం చేయాలన్న కుట్రతో జిందాల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, నూతన వేతనాలు అమలు చేయాలని, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన కార్మికులు స్టీల్‌ప్లాంట్‌ అడ్మిన్‌ బిల్డింగ్‌ను మంగళవారం ముట్టడించారు. స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే రహదారులన్నింటినీ దిగ్బంధించారు. అధికారుల నుంచి ఈ పోరాటానికి విశేష మద్దతు లభించింది. ముట్టడి కార్యక్రమానుద్దేశించి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, కో – కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడారు. దొడ్డిదారిన స్టీల్‌ప్లాంటును ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తోన్న ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను రెండేళ్ల పాటు జిందాల్‌కు కేటాయించేందుకు ఒప్పందం చేసుకున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలిపారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బిఎఫ్‌-3ని జిందాల్‌కు అప్పగిస్తున్న ప్రభుత్వం, యాజమాన్యం అతి త్వరలోనే మరికొన్ని విభాగాలను ప్రయివేట్‌కు అప్పగించే ప్రమాదముందన్నారు. నాణ్యమైన విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీసే ఒప్పందాలను కార్మికులు అంగీకరించబోరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్‌ బిల్లు చెల్లించకపోతే కరెంట్‌ ఆపుతాం అంటూ హెచ్చరించడం దారుణమన్నారు. ఇప్పటికే అదానీ గంగవరం పోర్టు బకాయిలు చెల్లించకపోతే మెటీరియల్‌ రవాణా చేయనంటోందని, రేపు జిందాల్‌ మెటీరియల్‌ సరఫరాను ఆపేస్తే ప్లాంట్‌ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రూ.మూడు లక్షల కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రలోని మోడీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తామంటుంటే రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలు నోరుమెదపకపోవడం దారుణమన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో అన్ని డిపార్టుమెంట్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️