‘ఉక్కు’ ప్రయివేటీకరణ కాకుండా మోడీపై ఒత్తిడి తెస్తాం

Dec 11,2023 21:03 #Dharna, #visakha steel

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటుపరం కాకుండా ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తామని గ్లోబల్‌ హ్యూమన్‌ రైట్స్‌ అవేర్‌నెస్‌ అసోసియేషన్‌ జాతీయ చైర్మన్‌ కాసల కోనయ్య అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1,033వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ సిఎంఎం, సిఆర్‌ఎంపి, సిఇడి, లూబ్రికెంట్స్‌ అండ్‌ హైడ్రాలిక్స్‌ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ త్యాగాలతో ఏర్పడి, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం తరుఫున ప్రధాన మంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మొండిగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ చైౖర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు జె.రామకృష్ణ, గుమ్మడి నరేంద్ర, టిఎన్‌టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ, ఎలుగుబంటి సత్యనారాయణ, ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.

➡️