కడప బరిలో షర్మిల

Mar 21,2024 23:24 #Kadapa, #ys sharmila

-కార్యకర్తల సమావేశంలో సానుకూలం
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి రంగం సిద్ధమైంది. అధిష్టానం సూచన మేరకు ఆ స్థానం నుండి పోటీ చేయడానికి ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన షర్మిల గురువారం కడప నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షర్మిల పోటీకి సానుకూలత వ్యక్తమైంది. కాంగ్రెస్‌ పార్టీ మరో రెండు రోజుల్లో మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబితాలో షర్మిల పేరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కడప పార్లమెంట్‌ స్థానం మొదటి నుండి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైసిపి ఏర్పాటయినప్పటి నుండి ఆ పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో షర్మిల కడప నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

➡️