కూలిన మూడంతస్తుల లాడ్జీ – అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Feb 5,2024 07:50 #collapsed lodge, #prakasam

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 15 సంవత్సరాల క్రితం నిర్మించిన పర్చూరి సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన మూడంతస్తుల లాడ్జీ ఆదివారం తెల్లవారు జామున కూలిపోయింది. ఆ సమయంలో లాడ్జీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. పర్చూరి సుబ్బారావుకు చెందిన భవనాన్ని బుజ్జి అనే వ్యక్తి అద్దెకు తీసుకొని అందులో లాడ్జి నిర్వహిస్తున్నారు. ఆ భవనం పక్కనే సుబ్బారావు సోదరుడు రామారావుకు చెందిన ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో భవనాన్ని నిర్మించేందుకు పిల్లర్లు ఏర్పాటు కోసం 15 అడుగుల లోతున గుంతలు తీశారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భవనం పక్కకు ఒరగడాన్ని గమనించిన లాడ్జి నిర్వాహకుడు బుజ్జి లాడ్జీలోని వారందరినీ ఖాళీ చేయించారు. తాను లాడ్జిని నడపలేననంటూ యజమాని సుబ్బారావుకు తెలిపారు. రెండ్రోజుల నుంచి లాడ్జిలోకి ఎవరిని అనుమతించాలేదు. శనివారం రాత్రి 11 గంటలు వరకూ లాడ్జి పక్కన భవన నిర్మాణ కార్మికులు పనులు చేశారు. వారు వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆదివారం తెల్లవారు జామున లాడ్జి పూర్తిగా కూలిపోయింది. భవనం కూలినప్పుడు భారీ శబ్దం రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. పక్క స్థలంలో 15 అడుగుల లోతు పునాదులు తీసిన కారణంగానే లాడ్జీ కూలిపోయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటి రూపాయల వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్లు భవనం యజమాని వాపోయారు.

➡️