కొనసాగిన సిహెచ్‌డబ్ల్యు రిలే దీక్షలు

Feb 15,2024 21:55 #asa, #Dharna

ప్రజాశక్తి – యంత్రాంగం: తమను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, యూనిఫాం, మెడికల్‌ కిట్లు, టిఎ, డిఎ, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు (సిహెచ్‌డబ్ల్యులు) చేపట్టిన సామూహిక రిలే దీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఎ కార్యాలయం ఎదుట దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. పాడేరు డివిజన్‌లోని 11 మండలాల్లో ఉన్న 36 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశా వర్కర్లుగా గుర్తింపబడని 687 మంది సిహెచ్‌డబ్ల్యులు ఉన్నారని, ఆశా వర్కర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ రూ.నాలుగు వేలు మాత్రమే వేతనం చెల్లించడం దుర్మార్గమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రూ.పది వేలు వేతనం ఇవ్వాలని, యూనిఫారం, సెల్‌ఫోన్లు, మెడికల్‌ కిట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షలకు సిఐటియు అల్లూరి జిల్లా సహాయ కార్యదర్శి ఎల్‌.సుందరరావు, ఎపి ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మంగమ్మ మద్దతు తెలిపారు. దీక్షల్లో చింతపల్లి, కొయ్యూరు, జికె.వీధి, పాడేరు, హుకుంపేట మండలాల నుంచి వచ్చిన సిహెచ్‌డబ్ల్యులు కూర్చున్నారు. పార్వతీపురం ఐటిడిఎ ఎదుట చేపట్టిన దీక్షలనుద్దేశించి శ్రామిక మహిళా సంఘం కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వి.ఇందిర మాట్లాడారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక కొండలపై నివసిస్తున్న గిరిజన మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వీరిని ఆశాలుగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్‌కుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, 21 నెలలు వేతన బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని గుర్తు చేశారు. సీతంపేట ఐటిడిఎ వద్ద దీక్షలు కొనసాగాయి.

➡️