చౌడాపూర్‌లో చెత్తకుప్పల్లో ఆధార్‌ కార్డులు.. పోస్ట్‌మ్యాన్‌ సస్పెండ్‌

Jan 23,2024 15:30 #postman, #suspended

వికారాబాద్‌ : ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్‌, పాన్‌ కార్డులు, పలు ఉత్తరాలు చౌడాపూర్‌ గ్రామంలో చెత్త కుప్పల్లో లభ్యమైన ఘటనపై పోస్టల్‌ అధికారులు స్పందించారు. పోస్ట్‌మ్యాన్‌ నరసింహులను సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం చౌడాపూర్‌ మండల పరిధిలోని చౌడాపూర్‌, మందిపల్‌, వీరాపూర్‌, విఠలాపూర్‌, అడవివెంకటాపూర్‌, మక్తవెంకటాపూర్‌ గ్రామాలకు నర్సింలు పోస్టుమ్యాన్‌గా పనిచేస్తున్నాడు. 2011 నుంచి ప్రజలకు ఆధార్‌, పాన్‌ కార్డులు, ఇతర పోస్టు కార్డులు వందల సంఖ్యలో వచ్చాయి.వాటిని ప్రజలకు అందించకుండా ఇంట్లోనే సంచిలో దాచి ఉంచాడు. పోస్టుమ్యాన్‌ కూతురు అనుకోకుండా శనివారం గ్రామ పంచాయతీ ద్వారా చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్‌లో ఆ ఉత్తరాల సంచిని పడేసింది.ఈ సంచిని గమనించిన గ్రామస్థులు.. ట్రాక్టర్‌ను ఆపి చెత్తలో నుంచి ఐడీ కార్డులను తీసి చూడగా వందల సంఖ్యలో ఆధార్‌, పాన్‌ కార్డులు దొరికాయి.గ్రామానికి చెందిన చాలా మంది అక్కడికి వచ్చి తమ ఆధార్‌ కార్డులను తీసుకున్నారు. మిగిలిన కార్డులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అప్పగించారు. దీంతో గ్రామస్థులు.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోస్టుమ్యాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. చెత్త ట్రాక్టర్‌లో దొరికిన ఆధార్‌ కార్డులపై నవాబుపేట్‌ పోస్టాఫీసు సిబ్బంది విచారణ చేపట్టి నరసింహులును సస్పెండ్‌ చేశారు.

➡️