జిఒ 3 ప్రకారం ఏజెన్సీలో డిఎస్‌సి పోస్టులు భర్తీ చేయాలి

– ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర

ప్రజాశక్తి – అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) :షెడ్యూల్‌ ప్రాంతాల్లో జిఒ 3 ప్రకారం డిఎస్‌సి పోస్టులు భర్తీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ఆదివాసీ గిరిజన భవనంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఒ 3 అమలు చేయకుండా 2024 డిఎస్‌సిలో ఆదివాసీలకు దగా చేసిందని మండిపడ్డారు. గిరిజనేతరులకు ఏజెన్సీ పోస్టుల్లో అవకాశం కల్పించడాన్ని ఖండించారు. పాడేరు, రంపచోడవరం ఐటిడిఎల పరిధిలో పోస్టులు మొత్తం 153 ఉండగా అందులో ఆదివాసీలకు దక్కేది తొమ్మిది పోస్టులు మాత్రమేనని, గిరిజనేతరులు పొందేది 144 పోస్టులని తెలిపారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా షెడ్యూల్‌ ప్రాంతాల్లో మొత్తం పోస్టులు 280కిగాను ఆదివాసీలకు దక్కేది కేవలం 12, గిరిజనేతరులకు 268 పోస్టులు దక్కుతున్నాయని తెలిపారు. మన్యం పార్వతీపురం జిల్లాలో పది పోస్టులకు మించి ఆదివాసీలకు దక్కడం లేదన్నారు. గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. డిఎస్‌సిలో పాడేరు ఏజేన్సీలో పని చేస్తున్న 186 గిరిజన సిఆర్‌టి పోస్టులను మాయం చేస్తూ అయా పోస్టుల్లో గిరిజనేతరులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 191 గిరిజన గురుకులాల్లో 517 పోస్టులను నోటిఫై చేశారని, అందులో అవుట్‌ సోర్సింగ్‌ టీచర్‌ పోస్టులను మాయం చేస్తూ గిరిజనేతరులకు అవకాశం కల్పించడం సరికాదన్నారు. గతంలో జిఒ 3 వల్ల ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ అమలైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖలో జారీ చేసిన పోస్టులు 506 ఉంటే ఆదివాసీలకు దక్కేది కేవలం 30 మాత్రమేనని చెప్పారు. ఈ విషయాలను గుర్తెరిగి ఆదివాసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌, మండల నాయకులు కిల్లో జగన్నాధం పాల్గొన్నారు.

➡️