ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు… పొత్తులపై క్లారిటీ వచ్చేనా?

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేంద్రహౌంమంత్రి అమిత్‌ షా పిలుపు మేరకు టీడీపీ చీఫ్‌ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ రాత్రికి లేదా రేపు అమిత్‌షాతో బాబు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లిన చంద్రబాబు… అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేయనున్నారు. టీడీపీ చీఫ్‌ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నెలకొంది. ఢిల్లీకి బయలుదేరే ముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యనేతలతో బాబు చర్చించారు. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని.. అక్కడకు వెళ్లాకే ఎందుకు పిలిచారు?.. ఏంటి? అనేది తెలుస్తుందని నేతలతో చంద్రబాబు అన్నారు. అమిత్‌షా చెప్పినదాన్ని బట్టి… తదుపరిగా చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుగుదేశం నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, రామానాయుడు, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు.. చంద్రబాబుతో సమావేశంలో పాల్గొన్నారు.

➡️