తాగునీటికి రూ.1500 కోట్ల నిధులు

– నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:తాగునీటి సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి నిధుల కొరత లేదని, ఇప్పటికే రూ.1500 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించి, విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనుల కల్పన అంశాలపై శనివారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. జూన్‌ నెలాఖరు వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలుచేయాలని సూచించారు. 15 రోజులకొకసారి మండల, జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాల స్థాయిని మానిటరింగ్‌ చేయాలని, బోరు బావుల పరిస్థితిని కూడా సమీక్షించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. కాలువల ద్వారా విడుదల చేసే నీరు శివారు ప్రాంతాలకు సక్రమంగా చేరేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పై సమీక్ష నిర్వహిస్తూ, కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని, అన్ని జిల్లాల యంత్రాంగం వంద రోజుల పని కల్పన లక్ష్యాన్ని అధిగమించాలని సిఎస్‌ ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పనులను ఉదయం 5.30 నుంచి 10.30ల వరకు నిర్వహించేలా చూడాలన్నారు. తాగునీటిని సరఫరా చేయాలని, ఉపాధి పనుల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు, జలవనరుల శాఖ ఇఎన్‌సి నారాయణ రెడ్డి తదితరులు పాల్గన్నారు.

➡️